ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నాయకుల జంపింగ్ లు మొదలయ్యాయి. తమకు టికెట్ ఇస్తుందని, లేదా తమకు ఉపయోగం ఉంటుందని భావిచే పార్టీల్లోకి వెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి నాలుగేళ్ళు దాటుతోంది. మధ్యలో బీజేపీ, టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగినా కూడా ఎందుకో అది జరగలేదు. ఇపుడు ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. దాంతో కొణతాల కూడా తన రూట్ ఎటో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపధ్యంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని కొనియాడుతూ మీడియా మీట్ లో మాట్లాడడం విశేషం. ఇన్నాళ్ళు బాబుకి తనకి పడది అన్నట్టు వ్యవహరించిన కొణతాలలో ఉన్నట్లుండి ఈ మార్పు రావడానికి కారణం ఎన్నికల రాజకీయమేనని అంతా భావిస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ ప్రకారం “నేను ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఓ పార్టీలో చేరుతాను. అది ఏ పార్టీ అన్న విషయాన్ని అతి త్వరలోనే వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయని, రాజకీయ వాతావరణం వేడెక్కిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి చివరిలో నోటిఫికేషన్ రావచ్చన్న వార్తలను ప్రస్తావించిన ఆయన, ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యతను తెలుగుదేశం తనకు అనుకూలంగా మలచుకుంటోందని అన్నారు. వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితరాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లడం వల్ల టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఎన్నికల తరువాత బీజేపీ మంత్రాంగాన్ని నడిపించి, పవన్, జగన్ ల మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ తగినంత కృషి చేయడం లేదని కొణతాల వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి మాటలను బట్టి చూస్తూంటే ఆయన తొందరలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారన్నది అర్ధమైపోతోంది. ఏపీని బాబు అభివృధ్ధి చేస్తున్నారని, మోడీ అడ్డుకుంటున్నరని అచ్చం టీడీపీ భాషను కొణతాల వాడడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నారు. పలు మార్లు అనకాపల్లి ఎంపీగా గెలిచిన కొణతాలను వచ్చె ఎన్నికల్లో తిరిగి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించేందుకు టీడీపీ సాగిస్తున్న తెర వెనక ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మాజీ మంత్రి తొందరలోనే పసుపు కండువా కప్పుకోవడం తధ్యమన్న మాట గట్టిగా వినిపిస్తోంది.