Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలైనప్పటి నుండి కూడా దర్శకుడు కొరటాల శివ తర్వాత సినిమా ఎవరితో అంటూ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అఖిల్‌తో అంటూ కొన్ని రోజులు, నానితో అంటూ కొన్నాళ్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు కొరటాల శివ సన్నిహితులు అనధికారికంగా ఆయన తర్వాత సినిమా చిరంజీవితో అంటూ తేల్చి చెప్పారు. దాంతో మీడియాలో అఖిల్, నాని అంటూ వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. సింపుల్‌గా సినిమాలను తెరకెక్కించి భారీ స్థాయి విజయాలను దక్కించుకోవడం కొరటాల స్టైల్. ఆయన చేసిన నాలుగు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి అంటే ఎంతటి గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి దర్శకుడికి పవన్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. మూడు సంవత్సరాలుగా పవన్‌తో సినిమాకు ప్రయత్నాలు చేశాడు. ఈమద్య ఒక కథ కూడా పవన్‌కు కొరటాల శివ చెప్పినట్లుగా తెలుస్తోంది.
కొరటాల శివ చెప్పిన కథ పవన్‌కు చాలా నచ్చింది. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తికి సంబంధించిన పాత్ర అది. అందుకే ఆ పాత్ర, ఆ కథ పవన్‌ను కదిలించాయి. దాంతో తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపు ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అవ్వడం, ఆపై రాజకీయాల్లో బిజీ అవ్వడంతో పవన్ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. 2019 ఎన్నికల తర్వాత కూడా పవన్ సినిమాలు చేస్తాడు అనే నమ్మకం లేదు. తాను చేయలేని ఆ కథను అన్న చిరంజీవి వద్దకు స్వయంగా పవన్ పంపించాడు. చిరంజీవితో మాట్లాడి కొరటాల శివతో కథ చెప్పించాడు. చిరంజీవి కూడా కథ విని ఇంప్రెస్ అయ్యి ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి అయిన వెంటనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యి, వచ్చే సంవత్సరం దసరాకు విడుదల చేసేలా అప్పుడే కొరటాల ప్లాన్ వేశాడు. మొత్తానికి పవన్ వల్ల చిరు, కొరటాల కాంబో వర్కౌట్ అయ్యిందని సినీ వర్గాల వారు అంటున్నారు.