Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్న విషయం తెల్సిందే. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కృష్ణంరాజు కేంద్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అలాంటి నేత తాను పెద్ద తప్పు చేశాను అని, రాజకీయాల్లో అవకాశాల కోసం కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అందరిలాగే తాను తప్పుడు నిర్ణయం తీసుకుని జీవిత కాలం బాధపడుతూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీలో తన చేరిక, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కృష్ణం రాజు మాట్లాడుతూ.. బీజేపీలో కీలకంగా ఉన్న సమయంలో ప్రజా రాజ్యం పార్టీ నుండి పిలుపు వచ్చింది. ఆ సమయంలో బీజేపీ పరిస్థితి అంత బాగా లేదు. దాంతో పార్టీ మారితే ఎంపీగా మరోసారి గెలవచ్చు అనే ఉద్దేశ్యంతో పార్టీ మారాను అని, ప్రజారాజ్యంలోకి వెళ్లిన తర్వాత తాను చేసింది తప్పు అని తెలుసుకుని వెంటనే బయటకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తన ఆలోచన తన పరిధిలో లేదని, ఎంపీ అయిపోవాలనే దుర్బుద్దితో తాను పార్టీ మారాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కృష్ణం రాజు గవర్నర్ పదవిని ఆశిస్తున్నారు. త్వరలోనే బీజేపీ అధినాయకత్వం ఆయనకు గవర్నర్ గిరిని కట్టబెట్టే అవకాశం ఉందనిపిస్తుంది.