Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతి రాజధాని రూపంలో ఆ పల్లెలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. అక్కడి ప్రజల ఆస్తుల విలువలు పెరిగిపోయాయి. హైదరాబాద్ వచ్చినా సెక్రెటరియేట్ కి వెళ్లినా కనపడతాడో ,లేదో తెలియని ముఖ్యమంత్రి రోజూ తమ కళ్ళ ముందే సచివాలయం వెళుతున్నాడు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి చెప్పక్కర్లేదు. దీంతో పాటు ఎక్కడెక్కడి నుంచో పేరున్న యూనివర్సిటీలు అక్కడికి వచ్చేసాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్లాసులు కూడా మొదలు పెట్టాయి. వడివడిగా మారిపోతున్న ఈ పరిస్థితులు ఆ పల్లె వాసులకి భలే కిక్ ఇచ్చాయి. కళ్ళ ఎదుటే అంతా మారిపోతుంటే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నాణేనికి ఓ వైపు మాత్రమే చూసి మురిసిపోతున్న వారికి ఇప్పుడిప్పుడే రెండో వైపు కూడా తెలిసొస్తోంది.
వాళ్ళు చెబుతున్నా వినే మన లాంటి వాళ్లకి అదో పెద్ద సమస్య అనిపించదు. కానీ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అమరావతి పరిధిలోని పల్లెలు ఇప్పుడు వాహనాల రొద , స్పీడ్ ని చూసి బెంబేలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన బస్సు ల స్పీడ్ చూస్తుంటే ఆడుకోడానికి పిల్లల్ని స్వేచ్ఛగా బయటికి పంపలేకపోతున్నారు. ఇక ఇసుక లారీల సంగతి సరే సరి. నిద్ర లేవక ముందే మొదలు అవుతున్న ఈ వాహనాల రణగొణ ధ్వనులు పొద్దుపోయే దాకా ఆగడం లేదు. ఒక్క ధ్వని కాలుష్యం మాత్రమే కాదు దుమ్ముధూళి పెరిగిపోయి ఎంతో మంది శ్వాససంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రమాదాలు కూడా పెరిగిపోయాయి. ఈ మధ్య ఓ ఇసుక లారీ ఢీకొని ఓ పాడి గేద చనిపోయింది. ఆ షాక్ నుంచి కోలుకోకముందే ఈ రోజు కృష్ణాయపాలెం వద్ద విట్ యూనివర్సిటీ కి చెందిన ఓ బస్సు స్పీడ్ గా వెళుతూ ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టింది. కనీసం వాహనం ఆపకుండా వెళ్ళబోతున్న ఆ డ్రైవర్ ని అడ్డుకున్న గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. ఓ గంటపాటు ఆ దారిన వచ్చే వాహనాన్ని ఆపి తమ నిరసన తెలియజెప్పారు. అధికారుల రంగప్రవేశంతో వాళ్ళు తాత్కాలికంగా తప్పుకున్నా ఈ సమస్యకి దీర్ఘకాలిక పరిష్కారం చూపకపోతే మాత్రం రాజధాని నిర్మాణ దశలో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం వుంది.