లాక్ డౌన్ సడలింపులపై కేటీఆర్ ముందస్తు ట్వీట్

తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై ఈరోజు కీలకంగా కేబినెట్ భేటీ జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతను జరగనున్న ఈ సమావేశంలో సాయంత్రం సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ప్రజారవాణా, ఇతర ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే విషయంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం జారీ చేసిన లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలపై తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రానికి అనుగుణంగా నూతన మార్గదర్శకాలను రూపొందించనున్నారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించడంతో పాటుగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించే విషయంపై కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అదేవిధంగా సరి బేసి విధానంలో హెయిర్ సెలూన్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. వాణిజ్య కార్యకాలాపాలు ప్రారంభించడానికి, అంతర్రాష్ట్ర బస్సు రవాణాకు కేంద్ర అనుమతించిన నేపథ్యంలో పొరుగున ఉన్న ఏపీకి బస్సులు నడిపే విషయంపై కూడా తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్రత్యేక ప్యాకేజీ విషయంపై కూడా కేసీఆర్ కేబినెట్ చర్చించనుంది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని.. మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ సడలింపుల విషయంలో చాలా సలహాలు, సూచనలు వస్తున్నాయని.. కేంద్రం కూడా నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో… సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకూ వచ్చిన సూచనల విషయమై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని కేటీఆర్ ట్వీట్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈరోజు కేబినేట్ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఎలాంటి బాంబులు పేలుస్తారో వేచి చూడాలి.