Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ కోరారు. విభజన జరిగి నాలుగేళ్లయినా హామీల అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తూ కేవీపీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైన, నిస్సహాయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లేఖలో ఆయన వివరించారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రస్తావించిన అంశాలతో సహా రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 78 ద్వారా సంక్రమించిన విశేష అధికారాలను ఉపయోగించి నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువే ఉండడం, హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేవీపీ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.