ఆంధ్రా ఆక్టోపస్ గా ఫేమస్ అయిన లగడపాటి రాజగోపాల్ ఎన్నికలకు ఒకరోజు ముందే ప్రెస్మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 19 సాయంత్రం వరకు సర్వే ఫలితాలను వెల్లడించకూడదని ఆంక్షలు ఉన్నాయి. అయితే లగడపాటి మాత్రం ఒకరోజు ముందే అంటే 18 సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటు చెయ్యడంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వెలగపూడి లోని వీ స్క్వేర్ ఫంక్షన్ హాల్ లో లగడపాటి ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రెస్మీట్ లో ఏపీ సర్వే ఫలితాలు వెల్లడిస్తారా ? లేకపోతే ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో అంశంపై ముందే హింట్ ఇవ్వబోతున్నారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పిన లగడపాటికి ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు ఖంగుతినిపించాయి. ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న ఆయన ఎట్టకేలకు తెలంగాణలో తన సర్వే ఫెయిల్ కావడంపై వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ సర్వే ఫలితాల్లో వైఫల్యం, ఏపీ ఫలితాలతో పాటుగా జాతీయ రాజకీయాల గురించి మే 19న సాయంత్రం ప్రకటిస్తానని లగడపాటి ఇప్పటికే ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఒకరోజు ముందే ప్రెస్మీట్ పెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఫలితాలు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందంటూ లగడపాటి ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఏపీలో ఎన్నికల అనంతరం లగడపాటి అమెరికాలో తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు నిర్వహించిన సమావేశానికి లగడపాటి రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశంలో ఏపీలో ప్రజలు సంక్షేమం..అభివృద్దికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. దీంతో లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే బూస్ట్ ఇచ్చే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.