Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వర్మ అన్ని సినిమాల్లానే తాజాగా ఎనౌన్స్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ కు ముందే వివాదాలకు కేంద్రబిందువై ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుంటోంది. రక్తచరిత్ర 1, రక్తచరిత్ర 2, బెజవాడ, వంగవీటి వంటి సినిమాలను వివాదాల నడుమే తెరకెక్కించి విడుదలచేసిన వర్మ… లక్ష్మీస్ ఎన్టీఆర్ ను అదే స్థాయిలో వివాదాల చుట్టూ తిప్పుతున్నారు. ఇంకా చెప్పాలంటే… గత సినిమాలకన్నే ఎక్కువగానే దీనిపై చర్చ నడుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి వర్మ ఎనౌన్స్ చేసిన వెంటనే టీడీపీ నేతలు రియాక్టయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీస్తే ఒప్పుకోము అంటూ హెచ్చరికలూ జారీచేశారు.
నిజానికి వర్మ చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీసే సాహసం చేస్తాడని మొదట ఎవరూ భావించలేదు. అయితే ఎప్పుడయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ను వైసీపీ నాయకుడు నిర్మిస్తున్నారని తెలిసిందో అప్పుడిక ఇది టీడీపీ వ్యతిరేక సినిమానే అన్న విషయం అందరికీ అర్ధమయింది. తనను ఎవరూ అడగకపోయినా, పనిమాలా రాంగోపాల్ వర్మ వైసీపీకి, లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని పదే పదే చెప్తున్నప్పటికీ ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఆ విషయం వర్మకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ సినిమా చంద్రబాబుకు వ్యతిరేకంగా లేకపోతే… వర్మ టీడీపీ నేతలతో కావాలని కయ్యం తెచ్చుకునేవాడు కాదు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనిత వంటి టీడీపీ నేతలను సోషల్ మీడియాలో వర్మ ఏ స్థాయిలో విమర్శిస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా టీడీపీకి వ్యతిరేకం అన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నదే వర్మ ఉద్దేశం. అందుకే ఇంతలా రచ్చ రచ్చ చేస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా సినిమా తీసేందుకు ఎవరూ ధైర్యం చేయరు. అయితే టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల పాలనా కాలం పూర్తిచేసుకుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజయ్యే నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ వచ్చేస్తుంది. ఆ సయయంలో ఈ సినిమా టీడీపీకి వ్యతిరేకంగానూ, వైసీపీకి సానుకూలంగానూ ప్రచారం తెచ్చిపెట్టేలా తెరకెక్కించాలని వర్మ ఆలోచన.
2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్న జగన్ ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టదల్చుకోలేదు. అందుకే జగన్ వైసీపీ నేతతో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పెట్టుబడి పెట్టిస్తున్నారని రాజకీయ, సినీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనగానే టీడీపీ ఇంతగా ఉలిక్కిపడటానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. వైస్రాయ్ హోటల్ కేంద్రంగా 1995లో జరిగిన పరిణామాలు ఎన్టీఆర్ ను గద్దె నుంచి తొలగించి చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి. సినిమాలో ఈ ఘట్టాన్ని అత్యంత హృద్యంగా తెరకెక్కించి చంద్రబాబుపై వ్యతిరేకత పెంచాలన్నది వైసీపీ ప్లాన్. మరి ఆ ప్లాన్ ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.