Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత జీవితం… ఆమె మరణానంతరం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జయలలిత, శోభన్ బాబుకు ఓ కుమార్తె ఉందన్న వార్తల్ని ఒకప్పుడు ప్రజలు అంతగా నమ్మలేదు కానీ ఆమె చనిపోయిన తర్వాత మాత్రం ఈ విషయంపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది.
బెంగళూరుకు చెందిన అమృత తానే జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టు ఆశ్రయించడం, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించిన నేపథ్యంలో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అసలు నిజంగానే జయలలితకు కూతురు ఉందా..ఉంటే ఆమె అమృతేనా అన్న అనుమానాల నేపథ్యంలో జయ మేనత్త కూతురు అయిన లలిత ఓ సంచలన ప్రకటన చేశారు. జయలలితకు ఒక కూతురు ఉన్నమాట నిజమేనని ధృవీకరించారు. చెన్నైలోని మైలాపూర్ లో 1980లో తన పెద్దమ్మ జయలలితకు పురుడు పోశారని తెలిపారు.
జయలలిత తల్లి మృతిచెందడంతో తన పెద్దమ్మ పురుడుపోయాల్సి వచ్చిందన్నారు. తనకు బిడ్డ జన్మించినట్లు ఎవరికీ చెప్పవద్దని పెద్దమ్మతో జయలలిత ఒట్టు వేయించుకున్నారని లలిత చెప్పారు. అయితే ఆ కూతురు అమృతేనా..కాదా అన్న విషయం మాత్రం తనకు తెలియదన్నారు. డీఎన్ ఏ పరిశోధనల ద్వారా అమృత కూతురా కాదా…అన్నది నిర్దారించవచ్చని తెలిపారు. అటు జయ కూతురుగా చెప్పుకుంటున్న అమృత చెప్పే విషయాలకు, లలిత చెప్తున్న కొన్ని మాటలకు పొంతన కుదరడం లేదు.
అమృత ఆగస్టు 14, 1980న బెంగళూరులో తనకు జయలలిత జన్మనిచ్చిందని చెప్తుండగా.లలిత మాత్రం జయ పురుడుపోసుకుంది చెన్నైలో అంటున్నారు. అయితే తన తల్లికి పురుడుపోసింది మాత్రం మేనత్త జయలక్ష్మే అని అమృత అంగీకరించారు. తాను పుట్టిన మూడు నెలల తర్వాత జయ తన సోదరి శైలజకు తనను ఇచ్చివేశారని, వారు తనకు అమృత అన్న పేరు పెట్టారని తెలిపారు. తనకు మంజులు అనే మరో పేరు కూడా ఉందని, తనను పెంచిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాతే తనకు ఈ విషయం తెలిసిందని ఆమె అన్నారు. తాను జయలలిత కూతురునన్న విషయం తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కూడా తెలుసన్నారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపారు.