Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన అధికార జేడీయూ తర్వాత మహాకూటమికి రాంరాం పలికిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటమితో తెగతెంపులు చేసుకోవడానికి కారణం ఉపముఖ్యమంత్రిగా ఉన్న లాలూ కుమారుడు తేజస్వియాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలే అని వార్తలొచ్చాయి. ఎన్టీయేతో పాత చెలిమిని పునరుద్ధరించుకునేందుకే నితీశ్ మహాకూటమిని వదలిపెట్టారని లాలూ ఆరోపించినప్పటికీ… ఆర్జేడీకి దూరం జరగడానికి నితీశ్ చూపించిన బూచి మాత్రం తేజస్వియాదవ్ నే. నిజానికి లాలూ ముద్దులతనయుణ్ని వ్యతిరేకిస్తోంది అధికార జేడీయూ మాత్రమే కాదు… సొంత పార్టీ ఆర్జేడీలోనే తేజస్వి అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా కనిపించడం లేదు. చాలామంది అంతర్గతంగా పార్టీలో తేజస్వి పాత్రను వ్యతిరేకిస్తున్నారు. అయితే తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ఇంటా, బయటా కొడుకుపై ఉన్న వ్యతిరేకతను లాలూ లక్ష్యపెట్టకుండా… ఆయన్ను అన్ని విధాలుగా వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ అని ప్రకటించి సంచలనం సృష్టించారు.
పార్టీ సీనియర్ నేతలు అబ్దుల్ బరి సిద్దిఖీ, రఘువంశ్ ప్రసాద్ సింగ్ లతో సమావేశమైన లాలూ అనంతరం కుమారుడు రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేశారు. తన పుత్రుడు పార్టీకి అందిస్తున్న సేవలు అద్భుతమని, వచ్చే 2020 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీని ముందుండి నడిపిస్తాడని స్పష్టంచేశారు. అయితే లాలూ నిర్ణయం కొందరు ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. లాలూ కన్నా ముందు బీహార్ అధ్యక్షుడు రామ్ చందర్ పుర్వే తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వియాదవ్ పేరును ప్రతిపాదించగా కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. కానీ పార్టీపై లాలూ కున్న పట్టు దృష్ట్యా చూస్తే… ఈ అసంతృప్తి పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఇక లాలూ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ విషయానికొస్తే… మహాకూటమికి నితీశ్ గుడ్ బై చెప్పిన తరువాత లాలూ రెండు రాజకీయ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడంతో పాటు… 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తేజస్వియాదవ్ ను ముఖ్యమంత్రిని చేయడం. ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా…కాంగ్రెస్… తృణమూల్ కాంగ్రెస్ వంటి నేతలతో ప్రత్యామ్నాయ కూటమికి ఏర్పాటుచేస్తూనే… మరోపక్క ఆర్జేడీలో తేజస్విని తన వారసుడిగా నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
ఆర్జేడీని తన సొంతంలా భావిస్తుంటారు లాలూ. పార్టీలోని ఇతర నేతలు కూడా అదే అభిప్రాయంలో ఉంటారు. కాబట్టి తేజస్వి యాదవ్ లాలూ వారసుడిగా మారడం కష్టమేమీ కాదు. పార్టీలోని చిన్న చిన్న అసంతృప్తులు అవే సద్దుమణుగుతాయి. తేజస్వికి సమస్యంటూ ఎదురయ్యేది కుటుంబం నుంచే. ముగ్గురు కుమారుల్లో లాలూ తన వారసుడిగా తేజస్విని ఎంచుకున్నారు. మరి ఆయన నాయకత్వాన్ని మిగిలిన ఇద్దరు కొడుకులు అంగీకరిస్తారో లేదో చూడాలి. ఇక లాలూ మరో రాజకీయ లక్ష్యం బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేయడం అన్నది ఇప్పుడున్న పరిస్థితులను బట్టిచూస్తే నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కలిసి వస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి అన్ని లెక్కలూ మారిపోతాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.