Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన తర్వాత జేడీయూ మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బీజేపీతో జతకట్టడంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే విచిత్రంగా లాలూ, ఆయన కుటుంబ సభ్యులు తమనుంచి విడిపోయిన జేడీయూపైన కాకుండా… ఆ పార్టీని దగ్గరకు తీసుకున్న బీజేపీపై తమ ఆగ్రహాన్ని వీలుచిక్కినప్పుడల్లా ప్రదర్శిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఓ బలమైన ప్రత్యామ్నాయ కూటమిని తయారుచేయడానికి లాలూ విఫలయత్నం చేస్తున్నారు. బీహార్ లో అక్టోబరు లో భారీ ర్యాలీ నిర్వహించారు. మోడీని, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ , ఎస్పీ తప్ప మిగిలిన పక్షాలేవీ ఆ ర్యాలీకి హాజరు కాలేదు. వీలైనన్ని ఎక్కువ పార్టీలను తన భారీ బహిరంగ సభకు హాజరయ్యేలా చేసి మోడీకి షాకివ్వాలని చూసిన లాలూ చివరకు తానే షాక్ తిన్నారు. అయినా లాలూ తన ప్రయత్నాలు మానలేదు. ప్రతి విషయాన్నీ మోడీకి ముడిపెడుతూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా లాలూ భార్య, బీహార్ ముఖ్యమంత్రి రబ్రీదేవి కూడా భర్త బాటలోనే మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని గొంతు కోయడానికి, చేతులు నరకడానికి చాలా మంది బీహారీలు సిద్ధంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానిని విమర్శించిన వారి చేతులు నరికివేస్తామని బీహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద రాయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రబ్రీ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఆర్జేడీ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ ను వరుసగా పదోసారి ఎన్నుకున్న జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రబ్రీ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీని వేలెత్తి చూపినవారి వేళ్లు నరికేస్తామని కొందరు బీజేపీ నాయకులు చెబుతున్నారని, దమ్ముంటే బీహారీల చేతులు నరకమని ఆమె సవాల్ విసిరారు.
బీహారీలు ఊరికే ఊరుకోరని, మోడీ గొంతు కోయడానికి, చేతులు నరకడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ బహిరంగంగా ఎవ్వరిపై పెద్దగా విమర్శలు చేయని రబ్రీదేవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహాకూటమిని విచ్చిన్నం చేయడంతో పాటు… లాలూ, ఆయన కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సంతోషి యాదవ్ ను అవినీతి కేసుల రూపంలో బీజేపీ టార్గెట్ చేస్తుండడంతో ఆగ్రహాన్ని దాచుకోలేక రబ్రీ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.