కోటేశ్వ‌ర‌రావుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయి

Lawyer files police case against on Kodaka Koteswara Rao song

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హేశ్ క‌త్తి వ్య‌వ‌హారంతో సత‌మత‌మ‌వుతున్న ప‌వ‌న్ కు మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. రేపు అట్ట‌హాసంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా అజ్ఞాత‌వాసిపై వివాదం రాజుకుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ పాడిన కొడుకా కోటేశ్వ‌ర‌రావు ఖ‌రుసైపోత‌వురో అంటూ ప‌వ‌న్ పాడిన పాట పెద్ద హిట్ట‌యి సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌గా… ఇప్పుడు అదే పాట వివాదంలో చిక్కుకుంది. విజ‌య‌వాడ‌కు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది కొడుకా కోటేశ్వ‌ర‌రావుపై అభ్యంత‌రం వ్య‌క్తంచేస్తూ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదుచేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ పాట వ‌ల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌రరావులు అంద‌రూ బాధ‌ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. కోటేశ్వ‌ర‌రావు అనే పేరు ఉన్న‌వారంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఈ పాట ఉంద‌ని ఆరోపించారు. సినిమా నుంచి వెంట‌నే ఆ పాట‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. త‌నకు సినిమా నాలెడ్జ్ త‌క్కువ‌ని, ఇంటి నుంచి కోర్టుకు, కోర్టు నుంచి ఇంటికి మాత్ర‌మే వెళ్తుంటానని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల త‌న అక్క‌య్య‌, అన్న‌య్య పిల్ల‌లు ఇంటికి వ‌చ్చార‌ని, వారు మ‌న బాబాయి పేరు కూడా కోటేశ్వ‌ర‌రావు క‌ద‌రా అని మాట్లాడుకుంటున్నార‌ని, త‌న ముందే కొడుకా కోటేశ్వ‌ర‌రావు అని పాడుతున్నార‌ని, అది త‌నకు చాలా బాధ‌క‌లిగించింద‌ని కోటేశ్వ‌ర‌రావు చెప్పారు. స్కూల్లో టీచ‌ర్ల పేర్లు కూడా కోటేశ్వ‌ర‌రావు అని ఉంటుంద‌ని, వారు త‌లెత్తుకుని స్కూల్ కు ఎలా వెళ్తార‌ని, అంద‌రూ ఎగ‌తాళి చేస్తోంటే తామెలా బ‌తికేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. త‌న‌తోపాటు తెలుగురాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావులు అంద‌రూ క‌ద‌లిరావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. మ‌రి న్యాయ‌వాది కోటేశ్వ‌ర‌రావు అభ్యంత‌రాన్ని అజ్ఞాతవాసి యూనిట్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

ఇటీవ‌ల చాలా సినిమాలపై ఇలా విడుద‌లకు ముందు అభ్యంత‌రాలు త‌లెత్తుతున్నాయి. త‌మ మ‌నోభావాలు కించ‌ప‌రిచారంటూ కొన్ని వ‌ర్గాల వారు సినిమాకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఈ నిర‌స‌న‌లు, ఫిర్యాదులు సినిమాకు ఫ్రీ ప‌బ్లిసిటీ తెచ్చిపెట్టి సినిమా విజ‌యానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని కొంద‌రు వాదిస్తున్నారు. మెగా ఫ్యామిలీకే చెందిన రామ్ చ‌ర‌ణ్ తేజ సినిమా మ‌గ‌ధీర స‌మ‌యంలోనూ ఇలాంటి వివాద‌మే చెల‌రేగింది. ఏం పిల్ల‌వే ఎల్ద‌మొస్త‌వా… పాట‌ను త‌న అనుమ‌తి లేకండా సినిమాలో వాడుకున్నారంటూ ప్ర‌ముఖ ర‌చ‌యిత వంగ‌పండు అప్ప‌ట్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఈ వివాదం మగ‌ధీర‌కు లాభించింద‌ని కొంద‌రు గుర్తుచేస్తున్నారు. మ‌రి అదే త‌ర‌హాలో కొడుకాకోటేశ్వ‌ర‌రావు వివాదం కూడా అజ్ఞాత‌వాసికి ఉప‌యోగ‌ప‌డుతుందేమో చూడాలి.