జైలు ఫుడ్ ఓ దొంగకు బాగా నచ్చేసిందట. మూడు పూట్ల సమయానికి ఆహారం లభిస్తుండటంతో జైలును సొంత ఇల్లులా భావించి జైలు నుంచి బయటకి వచ్చేసినా కావాలని దొంగతనం చేసి మళ్లీ అరెస్టవుతున్నాడు. చెన్నైకు చెందిన ఈ వింత దొంగ గురించి తెలుసుకుంటే ఆశ్చర్య పోక మానరు. 52 ఏళ్ల గణన ప్రకాశం ఈ ఏడాది మార్చి నెలలో ఓ దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. జూన్ 29న బెయిల్ మీద విడుదల అయ్యాడు. అయితే, జైలు జీవితాన్ని, అక్కడి ఆహారాన్ని, స్నేహితులను బాగా మిస్సవుతున్నట్లు భావించి.. మళ్లీ ఏదో ఒకలా జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా బైకు దొంగతనం చేస్తూ.. అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాకు తన ముఖం చూపించాడు. అలా చేస్తే పోలీసులు తనని గుర్తించి అరెస్టు చేస్తారనేది అతడి ప్లాన్. చెన్నైలోని కైలాశపురంలో బైకులను దొంగిలించిన తర్వాత సీసీటీవీ కెమేరాలకు కనిపించేలా తిరిగేవాడని, ఆ బైకుల్లో పెట్రోల్ అయిపోగానే బయట పార్క్ చేసి ఉండే ఇతర బైకుల్లో పెట్రోల్ దొంగిలించేవాడని పోలీసులు తెలిపారు. తంబరం వద్ద పెట్రోల్ దొంగిలిస్తున్న సమయంలో స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో తాను పెట్రోల్ మాత్రమే కాదని, బైకులు కూడా దొంగతనం చేస్తున్నానని తెలిపాడు. జైలుకు వెళ్లేందుకే తాను ఈ దొంగతనాలు చేస్తున్నాని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ‘‘జైలు బయట జీవితం అతడికి చాలా కష్టంగా ఉంది. కుటుంబ సభ్యులు కూడా అతన్ని పట్టించుకోవడం లేదు. తోటి ఖైదీలతో స్నేహం వల్ల అతడికి మళ్లీ జైలుకు రావాలనిపించింది. జైలులో సమయానికి ఆహారం లభించడంతో బాగా అలవాటు పడ్డాడని తెలిసింది.