ఎల్బీగారు మాట్లాడుతూ దిల్, మనసున్న మహారాజు, ఎదురులేని మనిషి ఇలా చాలా సినిమాల్లో కలసి పనిచేశాం. ఒక ఏడెనిమిదేళ్ల పాటు కనీసం రెండు మూడు రోజులకొకసారి మా కాంబినేషన్ ఉండేది. సెట్లో ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. చాలా సినిమాలు కలసి యాక్ట్ చేశాం. భూ కైలాస్‌లో అతను హీరోగా చేశాడు. నేను తండ్రిగా, గీతాంజలి గారు తల్లిగా చేశారు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశాం. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మనకున్న గొప్ప హాస్య నటుల్లో వేణు మాధవ్ గారు ఒకరు.
టాలీవుడ్ కామెడీ అంటే అన్‌కంపేరబుల్. ఏ భాషలో, ఏ దేశంలో ఎవరితో పోలిక లేకుండా 40 మంది వరకూ హాస్యనటులూ అందులో 20 మంది వరకూ దిగ్గజాలు, బాగా లీడ్ చేసిన కమెడియన్లు ఉండేవారు. వారందరిదీ ఎవరి బాణీ వారిది. ఎవరి టైమింగ్ వారిది. ఎవరి స్టైల్ వారిది. అలా వారు ఏలారు. అలాంటి వారిలో వేణు మాధవ్ ఒకరు.
కమెడియన్స్ ఎంత మంది ఉన్నా, 20 మంది ఉన్నా 40 మంది ఉన్నా, వాళ్లందరి మధ్యా ఇద్దరు చాలా స్పెషల్. అందరి మధ్యా వాళ్లిద్దరూ అలానే కనపడే వారు. అలానే వినపడే వారు. వాళ్లే ఎం.ఎస్. నారాయణ, వేణు మాధవ్. వాళ్లు చుట్టూ ఉన్న వారు అప్పుడున్న మూడ్ మర్చిపోయేలా, వాళ్ల మూడ్‌ని పక్కన పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి మెయింటెన్ చేసే వారు.
సెట్లలో ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్‌లు ఉన్నారని స్పష్టంగా తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునేవారు. వాళ్లు వేసే వేషం ఏదైనా.. వచ్చిన షూటింగ్ ఏదైనా.. వాళ్ల హడావుడి అలానే ఉండేది. అలా ఉండడం వల్ల అందర్నీ ఆకర్షించగలిగేవారు. షాట్లలోనూ, షాట్ల మధ్య గ్యాప్‌లోనూ, తెరమీద ఒక గాలి దుమారంలా ఉండేవారు. అందులో స్పెషల్‌గా నేను గుర్తించింది వేణు మాధవ్‌ని.
ఫలానా డైరెక్టరు హాస్యానికి పెద్ద పీట వేసేవారు అంటారు. ఈవీవీ సత్యనారాయణ గారు హాస్యానికి ఫ్లైటే వేశారు. ఫ్లైట్ నిండా కమెడియన్లను థాయిలాండ్ తీసుకెళ్లి షూటింగ్ చేసేవారు. అందరం నెల రోజులు గడిపి వచ్చే వాళ్లం. అలాంటిది.. అలాంటిదిలా చిక్కిపోయి చిక్కిపోయి అందరూ ఏజ్డ్ కాబట్టి అందరూ ఇలా వెళ్లిపోయారేమన్నట్టుగా చూస్తుండగానే కనుమరుగైపోయారు. మిగిలిన అతి కొద్ది మందిలో వేణు మాధవ్ వెళ్లిపోవడం వెలితిగా కనిపిస్తోంది.