Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎన్నికలకు ఏడాది ముందే వేడెక్కడానికి ప్రధాన కారణం గుంటూరు – విజయవాడ మధ్యలో జనసేన ఆవిర్భావ సభ అనుకుంటున్నారు అంతా. అయితే అంతకుముందే నిధుల విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే విషయాల్లో నిగ్గు తేల్చేందుకు పవన్ చొరవతో ఏర్పాటైన మేధావులతో ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ. జేపీ ,పద్మనాభయ్య , ఉండవల్లి , తోట చంద్రశేఖర్ లాంటి మేధావులతో ఏర్పాటైన ఈ కమిటీ కేంద్రం ఇంకా రాష్ట్రానికి 70 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని లెక్క తేల్చింది. అప్పటి నుంచే ఏపీ లో రాజకీయ వేడి మొదలైంది. తేల్చిన లెక్కలు , అవి సాధించడానికి కార్యాచరణ ప్రకటిస్తారు అనుకున్న జనసేన ఆవిర్భావ సభలో ఆ ప్రస్తావనే లేదు. రాజకీయ ఎత్తులో భాగంగా టీడీపీ ని పవన్ టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నిజానికి ఈ పరిణామం టీడీపీకి మేలే చేసింది. బీజేపీ ని వదిలించుకోడానికి భలే అవకాశం దొరికింది. ఫలితమే ఇప్పుడు కేంద్రాన్ని గజగజలాడిస్తున్న అవిశ్వాస తీర్మానం.
ఎప్పుడైతే టీడీపీ అవిశ్వాస తీర్మానం దాకా వెళ్లిందో అప్పుడే జనసేన వ్యూహ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. విభజన హామీలు తుంగలో తొక్కిన బీజేపీ ని వదిలేసి చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేయడంలో లోగుట్టు ఏమిటో జనానికి అర్ధం అవుతోంది. కేంద్రం తో పవన్ కుమ్మక్కు అన్న సందేహాల్ని నిజం చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వెల్లడించిన అంశాలపై కార్యాచరణ లేకుండా పోయిందని జేపీ బయటపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంకో కమిటి ఏర్పాటుకి పూనుకున్నారు. ఇది నిజంగా పవన్ ని దోషిగా చూపడమే. అయినా జేపీ మీద పొగడ్తలు కురిపించక తప్పని పరిస్థితుల్లో పవన్ ఉండటమే జనసేన రాజకీయ అవగాహనరాహిత్యానికి ఇంకో మచ్చుతునక.
ఇప్పుడు జేపీ లాంటి వెళ్లినా పర్లేదు , ఆయన పదేపదే వ్యక్తిగత విమర్శలు చేయరు అని పవన్ అనుకుంటూ ఉండొచ్చు. అయితే జేపీ వెళ్లిపోవడంతో ఇప్పుడు పవన్ తో నడుస్తున్న వామపక్షాల్లోనూ ఎన్నో సందేహాలు. పవన్ మీద సందేహాల కన్నా తాము బీజేపీ ఆడిస్తున్న ఓ నాటకంలో తెలియకుండానే భాగం అయ్యామా అన్న అనుమానం వారికి అవమానంగా కూడా అనిపిస్తోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు , ఢిల్లీ స్థాయి రాజకీయాలు కూడా అవే సంకేతాలు ఇవ్వడంతో మున్ముందు జేపీ బాటలో లెఫ్ట్ కూడా పవన్ కి షాక్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే వున్నాయి. అదే జరిగితే పవన్ విశ్వసనీయత ఇంకాస్త దెబ్బ తింటుంది. నమ్మకం కోల్పోయాక రాజకీయాల్లో రాణించడం అంటే నడిసంద్రంలో ఈత నేర్చుకోవడం లాంటిదే.