రాజకీయాలు ఎంత గమ్మత్తుగా వుంటాయో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడైతే రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటన చేశారో అప్పుడే ఆయనపై విమర్శల దాడి పెరిగింది. అది సహజమే. అయితే ఆయన అంటున్న ఆధ్యాత్మిక రాజకీయం వల్ల సాక్షాత్తు తిరుపతి ఏడుకొండలవాడు మాట పడాల్సివచ్చింది. నిజంగా ఇది నిజం. రజని చెబుతున్న ఆధ్యాత్మిక రాజకీయం వల్ల ప్రజల భక్తిభావం ఆయనకు ఓట్ల రూపంలో కురుస్తుందని భావించిన డీఎంకే కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది. రజనీని నేరుగా విమర్శించి ఆయన అభిమానులని దూరం చేసుకోవడం కన్నా తమిళుల్లో ఇంకోసారి ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి రగిలించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే ఇకపై తమిళనాడులో నాస్తిక సభలు విరివిగా జరిగేలా చూడాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఇటీవల తిరుచ్చి లో నాస్తిక సమాజ మహానాడు జరిగింది. అందులో డీఎంకే ఎంపీ , కరుణ కుమార్తె , స్టాలిన్ సోదరి కనిమొళి ఏకం గా ఏడుకొండలవాడి మీదే మాటల తూటాలు ప్రయోగించారు.
“ తిరుమల ఏడుకొండలవాడు డబ్బున్న వాళ్ళకే దేవుడు. సామాన్యుడు ఆయన్ని దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే. సొంత హుండీని కాపాడుకోలేని ఆయన ఇక భక్తులని ఏమి కాపాడతాడు. ఏడుకొండలవాడు దేవుడై,ఆయనకు శక్తులు ఉంటే ఇక ఆయనకు భద్రత ఎందుకు ? అసలు మతాలు ప్రపంచంలో వున్న మనుషుల్ని విడగొడుతున్నాయని, వారిని ఒక్క తాటి మీదకు తెచ్చే శక్తి నాస్తికత్వానికే వుంది. ప్రపంచ యుద్ధాల కన్నా మతాల వల్లే ఎక్కువ రక్తం చిందింది. ఈ జాతి ,మత ఘర్షణలు ఆగిపోవాలంటే నాస్తికవాదంతో పాటు మానవతావాదం వ్యాప్తి చెందాలి “ అని కనిమొళి చేసిన కామెంట్స్ ఒక్క తమిళనాట మాత్రమే కాదు యావద్భారతంలో హాట్ టాపిక్.
ఒకప్పుడు ద్రవిడ ఉద్యమ పునాదుల మీద నిలబడ్డ డీఎంకే కాలానుగుణంగా ఆ వాడి,వేడి తగ్గించింది. ఒక సమయంలో బీజేపీ తో రాజకీయ పొత్తు కూడా పెట్టుకుంది. ప్రజల్లో భక్తి భావం పెరుగుతున్న నేపథ్యంలో పునాదులనాటి సిద్ధాంతాలను కొన్నేళ్లుగా పక్కనబెట్టింది. ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక రాజకీయం అని రజని రేసులోకి రాగానే ఆయన్ని నేరుగా ఢీకొట్టడం కన్నా తమిళ రక్తంలో నాటుకుపోయిన ద్రవిడ ఉద్యమస్ఫూర్తిని రగిల్చి మరోసారి లబ్ది పొందాలని డీఎంకే ప్లాన్. ఆ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయడం కోసమే నాస్తిక సమాజ మహానాడుకి కనిమొళి ఓ వేదికగా వాడుకున్నారు. ఏడుకొండలవాడిని టార్గెట్ చేశారు. మొత్తానికి రాజకీయం పుణ్యమాని పరమ భక్తి భావాలున్న రజని వల్లే ఏడుకొండలవాడు మాట పడాల్సివచ్చింది.