ప్రేమంటూ కామించి తర్వాత వదిలేశాడు.. సినీ నటుడు అరెస్ట్.. !

ప్రాణాలను బలి తీసిన ప్రేమ వ్యవహారం

తమిళనాడులో ప్రేమించి వదిలేసిన వ్యవహారం కలకలం రేపింది. తాజాగా ప్రేమ పేరుతో  సహాయ నటిని నమ్మించి లైంగిక వాంఛలు తీర్చుకుని మొహం చాటేసిన తమిళ నటుడిని చెన్నై పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చెన్నై రాజా అన్నామలైపురానికి చెందిన త్యాగరాజన్  ‘తరిసూలం’ అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ నటుడు ‘నాడోడిగళ్‌’ సినిమాలో సహాయ నటి పాత్ర పోషించిన మహిళతో అతడికి కొంతకాలంగా ఏర్పడిన పరిచయం ప్రేమగా ముదిరింది. దాంతో వయసులో తన కంటే పెద్దదైన ఆమెతో ప్రేమంటూ నాటకమాడి ఆమెను తన వెంట తిప్పుకొని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మపలికాడు. ఆ తర్వాత త్యాగరాజన్.. పెళ్లి పేరుతో ఏకంగా కొంతకాలం సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకోవడమే కాకుండా భారీస్థాయిలో నగదును కూడా కాజేశాడు.

తాజాగా త్యాగరాజన్‌కి చెన్నై కార్పొరేషన్‌లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి సహాయనటితో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. దీంతో ఆ మహిళ గట్టిగా హెచ్చరించినట్లు మాట్లాడింది. ఆ సమయంలో త్యాగరాజన్ ఏమన్నాడంటే..  ‘నీవు నాకంటే ఒక సంవత్సరం పెద్ద. దాంతో మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు. నువ్వే వేరొకరిని పెళ్లి చేసుకో’ అంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైంది. పైగా అతను మరోసారి తన వెంట పడితే చంపేస్తానని ఆమెను బెదిరింపులకు దిగాడు. ఇక భరించలేకపోయిన బాధితురాలు చెన్నైలోని మాంబలం మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. త్యాగరాజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో త్యాగరాజన్ ను పుళల్ జైలుకు తరలించారు.