కాలం మారినట్టే ట్రెండ్ లు కూడా మారుతున్నాయి. ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమించిన వారు గంటల వ్యవధిలోనే వారికి బ్రేకప్ చెప్పేసి వారి ముందే ఇంకరితో ఫిక్సయిపోతున్నారు. గతంలో ఈ కల్చర్ పాశ్చాత్య దేశాల్లో ఉండేది ఇప్పుడు క్రమంగా మన దేశానికీ కూడా అలవాటయ్యింది. కానీ ఈ కల్చర్ ను అలవాటు చేసుకోలేని వాళ్ళు మాత్రం కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. అక్కడే పనిచేసే ఒక యువకుడితో ఏర్పడిన పరిచయం కొద్దికాలంలోనే ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తిరిగారు. సినిమాలు, షికార్లకు వెళ్లారు. ఆ సందర్భంగా తమ ప్రేమకు గుర్తుగా బోల్డన్ని ఫొటోలు కూడా తీసుకున్నారు. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి.
యువతి ప్రేమికుడిని దూరం పెట్టింది. తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేని యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. నీ ప్రేమ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశానని, ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేయాలని బెదిరించాడు. లేదంటే ఇద్దరం కలిసి ఏకాంతంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు బజారుకీడుస్తానని హెచ్చరించారు. మొత్తం రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, వెంటనే ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు యువకుడ్ని పట్టుకున్న పోలీసులు తమా స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.