ఫేస్బుక్ లో పెట్టిన ఓ ఆకతాయి పోస్ట్ ప్రేమజంట ఆత్మహత్యకు దారితీసింది. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌కుప్పం గ్రామంలో నివసించే నీలకంఠం కుమార్తె రాధిక (20) ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రేమ్‌కుమార్ అనే యువకుడు ఆమెను వేధించేవాడు. ఆమెపై ఫేస్బుక్లో అసభ్య రాతలు రాయడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పగా ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో ఈ వివాదం కులాల మధ్య చిచ్చుగా మారింది. ప్రేమ్‌కుమార్ వేధింపులపై గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించి అతడిని మందలించారు. మరోసారి ఆ యువతి వెంట పడొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రేమ్‌కుమార్ కొద్దిరోజులు ఆమె వెంట పడలేదు. ఇదిలా ఉండగా రాధిక తన మేనత్త కొడుకు విఘ్నేష్‌తో ప్రేమలో పడింది. వీరి విషయం ఇళ్లల్లో తెలియడంతో చదువు పూర్తయ్యాక ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ్‌కుమార్ రాధికకు సంబంధించిన ఫోటోలు సేకరించి వాటిని అసభ్య రీతిలో ఎడిటింగ్ చేసి ఫేస్బుక్లో ఫోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాధిక మనస్తాపంతో సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రేమ్‌కుమార్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో రాధిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న విఘ్నేష్ తాను బతకనని చెప్పి గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలో ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలోని రెండు కులాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.