టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి అక్రమాస్తులను కూడబెట్టారని, పలువురు ప్రముఖులకు బినామీగా వ్యవహరించారని నోట్లు రద్దయిన సమయంలో పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. 2016లో ఆయన నివాసం, కార్యాలయంలో రూ. 34 కోట్లను ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుంది. శేఖర్ రెడ్డిపై రెండు కేసులను సీబీఐ నమోదు చేయగా, వాటిని విచారించిన న్యాయస్థానం, నిందితులు దోషులని పేర్కొనడానికి సరైన సాక్ష్యాలు లేవని అభిప్రాయపడింది. అందుకే శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులన్నీ కొట్టి వేస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు ఈరోజు ప్రకటించింది. శేఖర్ రెడ్డితో పాటు కేసులను ఎదుర్కొన్న శ్రీనివాసులురెడ్డి, ప్రేమ్‌కుమార్, దిండుగల్ రత్నం, పుదుకోట రామచంద్రనల మీద ఉన్న ఆరోపణలనూ తొలగించింది.