తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్ అయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ఏర్పాటైన భక్త చరణ్‌దాస్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పార్టీ సీనియర్ నాయకులతో నిన్న ఉదయం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ద్వారా నియోజక వర్గాల వారీగా బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్.సి.కుంతియా కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.
ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ముకుల్ వాస్నిక్‌కు ఆమోదముద్ర వేసిన తరువాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. కూటమిలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లు, స్థానాలు కూడా ఖరారయ్యాయి. 119 సీట్లలో కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయనుంది. తెలుగుదేశం 15 స్థానాల్లో, టీజేఎస్ 10 చోట్ల, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగుతాయి. ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటించే అవకాశం ఉంది.
నాలుగు పార్టీల రాష్ట్ర శాఖల బాధ్యుల సమక్షంలో అభ్యర్థులను ప్రకటిస్తారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వాలు స్వయంగా పరిశీలిస్తూ, వివిధ సర్వేల ఆధారంగా ప్రతి సీటునూ ఆచితూచి ఎంపిక చేశారు. లోక్‌సభ సీట్లు, సామాజిక వర్గాలు ప్రాతిపదికగా అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరిగింది. కూటమికి కీలకంగా మారిన తెలుగుదేశం.. 2014లో తాను గెలిచిన స్థానాల్లోనే ఇప్పుడూ పోటీ చేయటానికి ఆసక్తి చూపింది. దీంతో భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేకపోతే, ఆయా సీట్లు టీడీపీకే దక్కనున్నాయి.
ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టీడీపీకి దక్కబోతున్నట్టు తెలిసింది. ఈ 8 సీట్లకూ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రమణ కోరుట్ల నుంచి పోటీ చేయడం ఖాయమైంది. మిగతావాటిలో కోదాడ, మహబూబ్‌నగర్, దేవరకద్రల్ని టీడీపీ కోరుతోంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేయనున్నందున, దానికి బదులు సికింద్రాబాద్ ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. ముషీరాబాద్, ఖైరతాబాద్ కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. వీలైతే కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మక్తల్ సీట్లను తీసుకోవటానికి టీడీపీ ఆసక్తి చూపుతోంది. నామా నాగేశ్వరరావు పోటీలో ఉంటారంటే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.