ప్రస్తుతం తెలంగాణలో రాబోతున్న ఎన్నికలకోసం రాజకీయ పార్టీలు మరియు ఆయా పార్టీల నేతలు ప్రజల్ని, తద్వారా వారి విలువైన ఓట్లని గెలుచుకునేందుకు తమ తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందడిలో ఒక కాంగ్రెస్ మాజీ నేత ఒక అడుగు ముందుకేసి బహిరంగంగానే ఓటర్లకి డబ్బులు వెదజల్లబోయి ఆభాసుల పాలయ్యాడు. విషయానికి వస్తే అలంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సంపత్ కుమార్ అనే మాజీ ఎమ్మెల్యే రాబోతున్న ఎన్నికల సమరంలో విజయ శంఖారావం మోగించడానికి కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. తన నియోజకవర్గ పరిధిలోని శంకపాలెం అనే గ్రామంలో ఇంటింటి ప్రదర్శన నిర్వహించడానికి వెళ్లిన సంపత్ కుమార్ మరియు అనుచర వర్గానికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు సంపత్ కుమార్ తరపున ప్రజలతో భేరసారాలకు దిగాడు. రాబోతున్న ఎన్నికల్లో గ్రామంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి గెలిపిస్తే 5 లక్షలు ఆ ఊరిలోని ఆలయ అభివృద్ధి కొరకు ఇస్తామని బేరసారం మాట్లాడారు.
దీనితో ఆవేశపడిన గ్రామస్తులందరూ మమ్మల్ని డబ్బులతో కొనాలనుకుంటున్నావా…? పదవిలోకి వచ్చిన తరువాత దత్తత తీసుకుంటానని చెప్పి, దత్తత తీసుకోపోగా, ఇప్పటివరకు ఇటు చూసింది లేదు, అసలు మేము కాంగ్రెస్ కి ఎందుకు ఓట్లు వెయ్యాలో చెప్పు అని పూర్తిగా కడిగేసినంత పని చేశారు. ఈ సంఘటనకి ముందు సంకాపురం గ్రామంలోకి ప్రచారానికి వచ్చిన సంపత్ కుమార్ ని గ్రామప్రజలందరు తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే తన కార్యకర్తతో ఈ బేరసారానికి వర్తమానం పంపించాడని ప్రజలందరూ భావిస్తున్నారు. ఆ గ్రామంలోని ప్రజల వ్యతిరేకత ఎంతగా ఉందంటే మరోసారి సంపత్ కుమార్ ని, అతని కార్యకర్తలని మరోమారు గ్రామంలోకి రాకుండా నిలువరించేందుకు సిద్ధం అవుతున్నారు. పదవిలో చేరిన తరువాత సంపత్ కుమార్ మా గ్రామానికి చేసిందేమి లేదని, తమ గ్రామంలో ఉన్న తాగునీటి ఇబ్బందులని, పాఠశాల పునరుద్ధరణకి చేసిన వినతులని ఏనాడు పట్టించుకున్నది లేదని, 2014 ఎన్నికల తరువాత మళ్ళీ మా గ్రామం మొహం చూడడం ఇదే తొలిసారని, ఎన్నికల వేళకే మేము గుర్తొచ్చే వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు. ఏదేమైనా ప్రజలలో ఈ మార్పు ఆహ్వానించదగ్గది.