హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఒకేసారి నాలుగు భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘మహాలక్ష్మి’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి. అంతకు ముందు నుండే క్వీన్ రీమేక్ గురించిన చర్చలు మొదలు అయ్యాయి. చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న క్వీన్‌ను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. అన్ని భాషల్లో కూడా క్వీన్ రీమేక్‌ను కాస్త అటు ఇటుగా ఒకే సారి విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకే అక్టోబర్ అయితే అన్ని భాషలకు కూడా అనుకూలం అని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
దసరాకు ఇప్పటికే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రం బరిలో ఉంది. దాంతో పాటు నాగార్జున, నానిల ‘దేవదాసు’, రామ్ హీరోగా నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమేరో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ మూడు ప్రముఖ చిత్రాలతో పాటు రెండు మూడు చిన్న చిత్రాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ‘మహాలక్ష్మి’ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడం అనేది సాహస నిర్ణయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి సినిమా ఒకవేళ అక్టోబర్‌లో విడుదల అయితే మాత్రం దానికి డేంజర్ జోన్ అని, హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు స్టార్ హీరోతో పోటీ ఎంత మాత్రం సబబు కాదు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ చిత్రం విడుదల తేదీలో మార్పు చేస్తారా లేదంటే అలాగే డేంజర్ జోన్లోనే విడుదల చేస్తారా అనేది చూడాలి.