క్షమించండి… తొలగించేస్తాం

Writer Srimani responds on Geetha govindam What the F Song

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతా గోవిందం’ చిత్రంకు సంబంధించిన వాట్‌ ద ఎఫ్‌ అనే పాట వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో రచయిత స్పందించాడు. పాటలోని కొన్ని పదాలు మరియు చరణాలు మహిళలను మరియు హిందూ మతస్తులను అవమానించేలాగా, మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. రాముడు, సీత గురించి ఇంకా ఆడవారి గురించి అవమానకరంగా ఉన్న ఆ పదాలను తొలగిస్తాం అంటూ సదరు పాట రచయిత శ్రీమణి ప్రకటించాడు. పాట వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి, వెంటనే ఆ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించేస్తాం అంటూ ప్రకటించాడు.

విజయ్‌ దేవరకొండ పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు అన్ని ఫ్లాట్‌ఫార్మ్‌లో కూడా దుమ్ము రేపుతోంది. విజయ్‌ దేవరకొండ యూత్‌ను ఆకట్టుకునేలా ఈ పాటను పాడాడు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాటలోని పదాలు అభ్యంతరకంగా ఉన్నాయి అంటూ విమర్శలు రావడం కాస్త విజయ్‌కి ఇబ్బందికరమే. అయినా కూడా వివాదం పెద్దది కాకుండానే పాటలోని సదరు పదాలను తొలగిస్తాం అంటూ రచయిత శ్రీమణి ప్రకటించడం అభినందనీయం అంటున్నారు. త్వరలోనే కొత్త వర్షన్‌ పాటను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మార్పు చేసిన పాటను కూడా విజయ్‌తోనే పాడిచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.