Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన మహానటి అంచనాలను అందుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ అద్బుతంగా నటించి సినిమాకు ప్రాణం పోసింది. ఇక ఈ చిత్రంతో దర్శకుడు నాగ్ అశ్విన్ అప్పటి పరిస్థితులకు, పరిసరాలకు తీసుకు వెళ్లాడు. అప్పట్లో ఉన్న సెట్టింగ్స్, ఇతరత్ర వాతావరణంను క్రియేట్ చేసేందుకు దర్శకుడు భారీగానే ఖర్చు చేసి ఉంటాడని అంతా భావించారు. కాని ఈ చిత్రం బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
‘మహానటి’ చిత్రంలో ఎంతో మంది స్టార్స్ కనిపించారు. అయితే వారు ఒక్కటి రెండు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. కనుక వారికి పెద్దగా పారితోషికం ఇచ్చి ఉండరు. ఇక కీర్తి సురేష్ మరియు సమంతలకు మాత్రం కాస్త ఎక్కువ పారితోషికం దక్కి ఉంటుంది. ఇతర విషయాలకు వస్తే దర్శకుడు తెలివిగా, గొప్పలకు పోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టినట్లుగా అనిపించింది. అందుకే ఈ సినిమా కేవలం 28 కోట్ల బడ్జెట్‌తో పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ప్రమోషన్‌తో కలిపి మొత్తం 30 కోట్ల లోపు బడ్జెట్‌తోనే ఈ చిత్రంను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ శాటిలైట్ రైట్స్ మరియు ఇతరత్ర రైట్స్ ద్వారా వచ్చే మొత్తంతో సినిమాకు ఖర్చు చేసిన మొత్తంకు సమానం అంటూ లెక్కలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో నిర్మాతలకు 40 నుండి 50 కోట్ల మేరకు లాభాలు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు చెబుతున్నారు.