ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌ల‌ను విస్త‌రించాల‌ని మ‌హేష్ ప్లాన్

ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌ల‌ను విస్త‌రించాల‌ని మ‌హేష్ ప్లాన్

హైద‌రాబాద్‌లో ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ చాలా పాపుల‌ర్ అయ్యింది. ఈ మ‌ల్టీప్లెక్స్ మ‌హేష్‌బాబుదే. ఏసియ‌న్ ఫిల్మ్స్‌తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగాడు మ‌హేష్‌. ఇప్పుడు బెంగ‌ళూరులో కూడా ఇలాంటి మ‌ల్టీప్లెక్స్ ఒక‌టి క‌ట్ట‌బోతున్నాడు. మ‌రోవైపు విశాఖ‌ప‌ట్నంలోనూ ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి రంగం సిద్ధం అవుతోంది. ఈసారి మ‌హేష్‌తో సురేష్‌బాబు కూడా జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. ఏసియ‌న్ సునీల్‌, మ‌హేష్‌, సురేష్ బాబులు క‌లిసి ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. విశాఖ‌లో అత్యంత ర‌ద్దీ ప్ర‌దేశాల‌లో ఒక‌టైన జ‌గదాంబ చుట్టు ప‌క్క‌లే ఈ మ‌ల్టీప్లెక్స్ రాబోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే స్థ‌ల సేక‌ర‌ణ జ‌రిగిన‌ట్టు, త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న కూడా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.విశాఖ అనే కాదు, రెండు తెలుగురాష్ట్రాల‌లో ఉన్న ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల‌లో ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌ల‌ను విస్త‌రించాల‌ని మ‌హేష్ ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే మ‌రో రెండు మూడు న‌గ‌రాల్లో ఏఎంబీలు రాబోతున్నాయి కూడా.