‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతున్నాడు. ప్రస్తుతం మహేష్‌బాబు చేస్తున్న ‘మహర్షి’ చిత్రం విడుదల కాకముందే సుకుమార్ దర్శకత్వంలో మూవీని ప్రారంభించబోతున్నారు. వచ్చే వేసవిలో మహర్షి చిత్రం విడుదల కానుండగా, అప్పటికే సినిమాను సగం పూర్తి చేయాని సుకుమార్ ప్రయత్నాలు చేశాడు. రెండు మూడు నెలల క్రితమే ఒక స్టోరీని మహేష్‌బాబుకు వినిపించడం, ఆ స్టోరీకి మహేష్‌బాబు ఓకే చెప్పడం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంతకు ముందు సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్‌కు తాజాగా నో చెప్పాడని, మరేదైనా మంచి సబ్జెక్ట్‌తో రావాల్సిందిగా సుకుమార్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది.
మహేష్‌బాబుకు మొదట సుకుమార్ ‘రంగస్థలం’ మాదిరిగా 1980 అంతకు ముందు కాలంకు చెందిన పీరియాడిక్ కథను చెప్పడం జరిగింది. ఆ స్క్రిప్ట్‌కు మొదట మహేష్ ఓకే చెప్పాడు. కాని ఈమద్య కాలంలో తెలుగులో వరుసగా పీరియాడిక్ చిత్రాలు వస్తున్నాయి. రాజశేఖర్, నాని, బాలకృష్ణ, శర్వానంద్ ఇలా పలువురు హీరోలు పీరియాడిక్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నారు. ఆ కారణంగానే మరో యూనిక్ స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సుకుమార్‌ను మహేష్‌బాబు కోరినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఆ పీరియాడిక్ చిత్రాన్ని చేద్దామని సుకుమార్‌కు సూచించాడట. దాంతో ప్రస్తుతం మహేష్ కోసం మరో మంచి స్క్రిప్ట్‌ను వెదికే పనిలో పడ్డాడు సుకుమార్. కథ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా ప్రారంభం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.