మేజర్ గా మహేష్ దొరికిపోయాడు

ఓ మైనర్ పలుసార్లు అరెస్ట్ అయి చరిత్ర సృష్టించాడు. తన పదిహేనో ఏట నుంచే నేరాలు చేయడం ప్రారంభించిన మహేష్‌ మైనర్‌గానే అనేకసార్లు అరెస్టు అయ్యాడు. ఓ కేసులో శిక్ష పడటంతో స్పెషల్‌ హోమ్‌కు తరలించారు. అయినాగానీ.. శిక్షాకాలం పూర్తికాకుండానే తప్పించుకుని పారిపోయాడు. ఆ వెంటనే మళ్లీ నేరాలు చేయడం ఆరంభించి వారం రోజుల్లో నాలుగు చోట్ల తెగబడ్డాడు. ఈలోపు మైనర్ దాటి మేజర్‌గా అయ్యాడు. ఇతడిని తాజాగా ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ నేరగాడి నుంచి రూ.15 లక్షల విలువైన సంపద, వాహనం స్వాధీనం చేసుకున్నామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

కాగా తెలంగాణలోని నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్‌ మహేష్‌ (19) తన 15వ ఏట నుంచే నేరాలు చేయడం ప్రారంభించాడు. రాజధానితో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో మొదట నేరాలు చేయడం ప్రారంభించి ఆ తర్వాత ఇళ్లల్లో దొంగతనాలు చేయడం ఆరంభించాడు. ఇప్పటి వరకు మహేష్‌పై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. మూడేళ్ల క్రితం మైనర్‌గా ఉన్న మహేష్‌ను పట్టుకున్న వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి మూడేళ్ల శిక్ష విధించడంతో గాజులరామారంలోని గవర్నమెంట్‌ స్పెషల్‌ హోమ్‌ ఫర్‌ బాయ్స్‌లో ఉంచారు. అక్కడి అధికారులు మహేష్‌ తో పాటు మరికొందరికి వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించారు. అందులో మహేషే ని గచ్చిబౌలిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో (ఎన్‌ఐసీ) చేర్పించారు.

కాగా రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్‌ గత నెలలో ఎన్‌ఐసీ నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించి గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. లాక్‌డౌన్‌కు వారం రోజుల ముందు ఇలా బయటకు వచ్చిన మహేష్‌కు మైనార్టీ కూడ దాటిపోయాడు. అప్పటి నుంచి లాక్‌డౌన్‌ మొదలయ్యే వరకు కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేటల్లో నాలుగు నేరాలు చేశాడు. ఇందులో రెండు వాహనచోరీలు కాగా.. మరో రెండు ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. మొత్తానికి అతడిని తాజాగా పట్టుకోవడం విశేషం.