క‌మ‌ల్ హాస‌న్ తో న‌గ్మా భేటీ

mahila-congress-leader-nagma-meet-with-kamal-haasan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో కాంగ్రెస్ నాయ‌కురాలు, సినీ న‌టి న‌గ్మా భేటీ అయ్యారు. ఇటీవ‌ల సినిమాల సంగ‌తి మ‌ర్చిపోయి రాజ‌కీయాల గురించి మాత్ర‌మే మాట్లాడుతున్న క‌మ‌ల్ తో న‌గ్మా స‌మావేశం కావ‌టం త‌మిళ‌నాడులో హాట్ టాపిక్ అయింది. కొన్నిరోజులుగా క‌మ‌ల్ సామాజిక మాధ్య‌మాల‌తో పాటు…బ‌హిరంగ వేదిక‌ల‌పైనా…రాజ‌కీయాల గురించి ఎక్కువ‌గా మాట్లాడుతున్నారు. తాను హోస్ట్ చేస్తున్న త‌మిళ బిగ్ బాస్‌లోనూ రాజ‌కీయ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్న‌ప్పుడ‌ల్లా క‌మ‌ల్ అధికార అన్నాడీఎంకె పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ప్ర‌భుత్వంపై ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌టమే కాకుండా…రాష్ట్ర మంత్రుల అవినీతి కుంభ‌కోణాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లకు, త‌న అభిమానుల‌కు పిలుపునిస్తున్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌వేశం ఎప్పుడో జ‌రిగిపోయిందంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపైనే కాదే…కేంద్ర‌ప్ర‌భుత్వంపైనా క‌మ‌ల్ నిప్పులు చెరుగుతున్నారు. త‌మిళ‌నాడులో తీవ్ర వివాదం రేపిన నీట్ వ్య‌వ‌హారంపై కేంద్రం తీరును త‌ప్పుప‌డుతున్నారు. ఇలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న క‌మ‌ల్ హాస‌న్ తో కాంగ్రెస్ నాయ‌కురాలైన న‌గ్మా భేటీ కావ‌టం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఆళ్వార్ పేటలోని క‌మ‌ల్ ఇంటికి వెళ్లిన న‌గ్మా సుమారు గంట పాటు వివిధ అంశాల‌పై క‌మ‌ల్ తో చ‌ర్చించారు. తాజా రాజ‌కీయాలు, త‌మిళ‌నాడు ప‌రిస్థితులుతో పాటు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపైనా క‌మ‌ల్, న‌గ్మా చ‌ర్చించుకున్న‌ట్టు తెలుస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ చేస్తున్న రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ఇప్పుడు న‌గ్మాతో భేటీ కావ‌టాన్ని గ‌మ‌నిస్తే…ఆయ‌న కాంగ్రెస్ లో చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేస్తున్న‌క‌మ‌ల్ హాస‌న్ ను త‌మ పార్టీలోకి చేర్చుకోటానికి కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, అందుకే క‌మ‌ల్ తో ప‌రిచ‌యం ఉన్న సినీ న‌టి న‌గ్మాను మ‌ధ్య‌వ‌ర్తిగా పంపించింద‌న్న వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళ‌నాడులో ద‌శాబ్దాల క్రిత‌మే ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ క మ‌ల్ ద్వారా మ‌ళ్లీ ఆ రాష్ట్రంలో బ‌లం పెంచుకోవాల‌ని భావిస్తోంది. అయితే క‌మ‌ల్ కాంగ్రెస్ లో చేర‌తారా లేక కొత్త పార్టీ పెడ‌తారా అన్న‌ది తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు:

కోదండం మాస్టారు పార్టీ పెడతారా..?

ముందస్తుపై మోడీని నమ్మని చంద్రులు

మిస్ ఇండియా ద‌క్షిణాఫ్రికాగా తెలుగు యువ‌తి