మైసూరా రెడ్డి… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పుడెప్పుడో కోట్ల క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ గా పని చేసిన ఈ సీనియర్ నాయకుడు దాదాపు 25 ఏళ్ళు కాంగ్రెస్ లో కొనసాగారు. అయితే హోమ్ మినిస్టర్ పదవి పోయాక ఆయనకు ఆ స్థాయి పదవి, గౌరవం దక్కింది లేదు. ఇక ఏపీ కాంగ్రెస్ లో వై.ఎస్ హవా మొదలు అయ్యాక సీన్ పూర్తిగా తిరగబడింది. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఆయన టీడీపీ పంచన చేరారు. అక్కడ రాజ్యసభ సీటుతో పాటు పార్టీ పదవులు కూడా అనుభవించారు. ఇక అక్కడే ఉండిపోతారు అనుకుంటే మరో అనూహ్య పరిణామంతో వైసీపీ అధినేత జగన్ పంచన చేరారు. అయితే అక్కడా మైసూరా రాజకీయంగా స్థిరపడలేదు. జగన్ మీద విమర్శలు చేసి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయన టీడీపీ లో చేరడం ఖాయం అనిపించింది.
అనూహ్య రాజకీయాలకు పెట్టింది పేరైన మైసూరా ఇంకో అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
వ్యక్తిగత స్థాయిలో తెలంగాణలోని పాల్వంచకు వచ్చిన మైసూరా చేసిన వ్యాఖ్యలు ఆయన మనసులో మాటను చెప్పకనే చెప్పాయి. 2019 ఎన్నికలతో ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోతుందని మైసూరా జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 23 శాతం వున్న కాపులు అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం ఏపీ ఎన్నికల మీద బలంగా ఉంటుందని మైసూరా చేసిన వ్యాఖ్యలతో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందన్న టాక్ బయటకు వచ్చింది. అయితే పార్టీలో చేరడం మాట ఎలా వున్నా ఎంతో స్వేచ్ఛ వున్న కాంగ్రెస్ , సంస్థాగత నిర్మాణం బలంగా వున్న టీడీపీ , రాజకీయ బలం కలిగిన వైసీపీ లో ఇమడలేకపోయిన మైసూరా ఇప్పుడు పవన్ దగ్గర ఏ మాత్రం ఇమడగలరు అన్నదే పెద్ద ప్రశ్న. జనసేన నిర్వహణలో పవన్ వ్యవహారశైలి మీద ఇప్పటికే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇక చిన్నపాటి ఇబ్బందికే పెద్ద పెద్ద పార్టీలను వదిలేసుకున్న మైసూరా ఇంకా రాజకీయంగా తడబడుతున్న జనసేనలో ఎలా ఒదుగుతారు అన్నది సందేహమే.