Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ప్రద్యుమ్నను బస్సు కండక్టర్ అశోక్ కుమార్ హత్యచేసినట్టు భావిస్తుండగా..తాజాగా సీబీఐ అధికారులు రేయాన్ స్కూల్ లో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఆ విద్యార్థి…హత్య జరిగినరోజు ప్రద్యుమ్నతో కలిసి వాష్ రూమ్ కు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో తేలింది.
ప్రద్యుమ్న సెప్టెంబరు 8న తాను చదువుతున్న రేయాన్ స్కూల్ లోనే దారుణ హత్యకు గురయ్యాడు. వాష్ రూం వద్ద రక్తపు మడుగులో శవమై పడిఉన్నాడు. ప్రద్యుమ్న గొంతుపై బలంగా పొడిచినట్లు గాయాలున్నాయి. చిన్నారిపై లైంగిక చర్యకు ప్రయత్నించిన బస్సు కండక్టర్ అశోక్ కుమార్ అది విఫలమవడంతో హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. రెండు నెలలగా ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మంగళవారం ఇంటర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రద్యుమ్న ను దారుణంగా హత్యచేసింది అశోక్ కుమార్ కాదని, ఇంటర్ విద్యార్థే బాలుడి మెడపై కత్తితో పొడిచాడని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. విచారణలో ప్రతిసారి ఆ విద్యార్థి పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థి తండ్రి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడాడు. తన కుమారుడిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారని, ప్రద్యుమ్నను హత్యచేసింది అతడేనని తనతో చెప్పారని, అయితే తన కుమారుడు ఎలాంటి నేరం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు.