Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతదేశంలో సెక్యులర్ నేతలు, పార్టీలు అంటే ఉన్న ఏకైక అర్దం… హిందుత్వాన్ని వ్యతిరేకించడం. హిందువుల పండుగలను, దేవుళ్లను, అలవాట్లను విమర్శిస్తే… వారు సెక్యులర్ నేతలుగా గుర్తింపు పొందినట్టే. వీలు కుదిరినప్పుడల్లా హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ… మైనార్టీలకు పెద్దపీట వేస్తూ… తమ లౌకిక భావజాలాన్ని ప్రదర్శిస్తుంటారు నేతలు. సాధారణంగా ఎక్కడయినా… మెజార్టీలుగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుంది… వారికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యం లభిస్తుంది. ప్రపంచంలో ప్రతిచోటా జరిగేది ఇదే… కానీ భారత్ లో మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడ మైనార్టీలు అనుకున్నదే జరుగుతుంది. ఏ విషయంలో అయినా వారికే ముందు ప్రాముఖ్యత లభిస్తుంది. అదే సెక్యులరిజం అన్న భ్రమల్లో బతికేస్తుంటారు మన నేతలు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కోవకే చెందుతారు. ఆమె హిందూ మతానికే చెందిన వ్యక్తయినా… ఎప్పుడూ హిందువుల గురించి కానీ… వారి పండుగల గురించి కానీ… ఒక్క మాట సానుకూలంగా మాట్లాడిన సందర్భమే లేదు. పైగా ఎప్పుడూ మైనార్టీ భజన చేస్తుంటారు. తాజాగా మమత ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై కనబర్చిన వైఖరి చూస్తే ఎవరికయినా ఆగ్రహం రాక మానదు. దసరా ఉత్సవాలు జరిగే సమయంలోనే ఈ సారి ముస్లింల మొహర్రం పండుగ వచ్చింది. తనను తాను సెక్యులర్ గా భావించే మమత మొహర్రం సందర్భంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి ఉత్తర్వులివ్వడం సరికాదని కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహర్రం రోజుతో సహా అన్ని రోజులూ అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతించింది. నిమజ్జనానికి, ముస్లింల తజియా ఊరేగింపుకు రూట్ మ్యాప్ ఖరారు చేయాలని పోలీసులను ఆదేశించింది. పౌరుల హక్కలను ఆలోచనారహితంగా నియంత్రించరాదని మమత ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఈ సెక్యులర్ నేతకు ఎక్కడాలేని కోపం తెప్పించాయి. తాను ఎంతో లౌకికదృక్పథంతో మొహర్రం రోజున నిమజ్జనంపై నిషేధం విధిస్తే… హైకోర్టు దాన్ని ఎత్తివేయడమేమిటని ఆమెకు ఆగ్రహం కలిగింది. కానీ ఎంత ముఖ్యమంత్రి అయినా హైకోర్టుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేరు కదా… అందుకుని ఆమె కొత్త రాగం అందుకున్నారు. మొహర్రం రోజున దుర్గామాత నిమజ్జనాల సందర్భంగా ఒకవేళ హింస చెలరేగితే బాధ్యత తనది కాదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు… తాను ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని కూడా పరోక్షంగా హైకోర్టును ఉద్దేశించి విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో హింస జరిగితే తనది బాధ్యత కాదని చెప్పడం ద్వారా మమత… అల్లర్లు సృష్టించే అసాంఘిక శక్తులకు ఊతమిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.