Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్డీయే ప్రభుత్వాన్ని తొలినుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్ననాయకురాలు మమతా బెనర్జీ. ప్రధాని మోడీని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను వీలుచిక్కినప్పుడల్లా విమర్శిస్తున్నారు మమత. కేంద్రప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆమె తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఆమె బీజేపీ తీరును ఎండగడుతున్నారు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తృణమూల్ కాంగ్రెస్… ఈ సారి బీజేపీ ప్రభుత్వాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం మోడీనే అన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.
కారణం ఏదైనా కానీ… ఆమె మోడీ సర్కార్ తీసుకునే ఏ నిర్ణయాన్నీ హర్షించడం లేదు. స్వతంత్ర దినోత్సవాలను వారం రోజులు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మమత బేఖాతరు చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలను వ్యతిరేకించారు. తాజాగా… ఆధార్ కార్డును అన్నింటికీ లింక్ చేయాలని భావిస్తున్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మొబైల్ నెంబర్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబోనని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఇటీవలే తేల్చిచెప్పిన మమత సుప్రీంకోర్టులోనూ తన వాణి వినిపించాలని నిర్ణయించారు. అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేయడంపై అభ్యంతరాల తెలియజేస్తూ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈ నెల 30న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.