మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడితో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఒకరికొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనను విమర్శిస్తూ మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అదంతా నరేంద్ర బాబు సర్కార్ నాటకం అంటూ కొట్టి పారేశారు. మరోవైపు ఘటనపై కేంద్ర హోం శాఖ.. బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేశారు. డిసెంబర్ 14న హోం శాఖ కార్యదర్శి ముందు హాజరు కావాలని ఆదేశించారు. హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 19, 20 తేదీల్లో కోల్‌కతాలో పర్యటించాలని నిర్ణయించారు.

ఘటనపై బెంగాల్ గవర్నర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ తీవ్రంగా స్పందించారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న వ్యాఖ్యలను ఉప‌సంహ‌రించుకోవాల‌ని సూచించారు. ‘మేడం.. నిప్పుతో చెల‌గాటం ఆడ‌కండి’ అంటూ ఆయ‌న దీదీకి హెచ్చరికలు చేశారు. బెంగాల్‌లో శాంతిభ‌ద్రతలు క్షీణిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించారు.

‘జేపీ నడ్డాకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుక‌ల‌తో దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్టకరం. ప్రజాస్వామ్యానికి మ‌చ్చ. రాష్ట్ర ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రాజ్యాంగాన్ని అనుసరించాలి. రాష్ట్రంలో శాంతిభ‌ద్రతలు క్షీణిస్తున్నాయి’ అని గ‌వ‌ర్నర్ జ‌గ‌దీప్ వ్యాఖ్యానించారు.