ధవళేశ్వరం ఐవోసీఎల్ వాంబేకాలనీ 12వ బ్లాక్‌లోని 4వ అంతస్తులో యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన ధవళేశ్వరంలో కలకలం రేపుతోంది. తునికి చెందిన మునూరి నతానియోలు అలియాస్ చిన్నా (23) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రిందట వాంబేకాలనీలో అద్దెకు దిగాడు. ధవళేశ్వరం గొల్లపేటకు చెందిన సత్యవేణి అనే వివాహితతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే అతను వాంబే కాలనీకి వచ్చారని అంటున్నారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయట నుండి చిన్నా ఇంటికి వచ్చాడు. అతన్ని కలిసేందుకు కొద్దిసేపటి తర్వాత సత్యవేణి ఇంట్లోకి వెళ్లగా, ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న చిన్నా కన్పించడంతో చీరను కత్తిరించి చిన్నాని కిందకి దింపింది ఎదురింట్లో ఉంటున్నవారి సహాయంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. ధవళేశ్వరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది వివాహేతహర సంబంధం నేపధ్యంలోనే జరిగిన ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు.