మానవత్వం మరచిన సమాజం: మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య.. అసలు నిజం తెలిసి షాక్

కరోనా లక్షణాలున్నాయంటూ అధికారులు ఓ వ్యక్తిని టెస్టింగ్ కోసం తీసుకెళ్లారు. అదే సమయంలో కొందరు ఆ తీసుకెళ్లే విషయాన్ని వీడయో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది చూసిన ఆ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన వ్యక్తి..  కేరళలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తల్లిని చూసేందుకు అతడు సొంతూరుకు వచ్చాడు. అయితే అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు, ఇరుగు పొరుగు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్సు రాకపోవడంతో స్థానికులే వాహనాన్ని ఏర్పాటు చేయించి మరీ ఆస్పత్రికి పంపారు. ఆ సమయంలో కొందరు అత్యుత్సాహంతో అతని వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి వైరల్‌గా మారాయి.

అయితే ఆయన శాంపిల్స్ తీసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఇంటికి పంపడంతో ఇరుగు పొరుగు ప్రజలు దుర్భాషలాడడంతో మనస్థాపానికి లోనయ్యాడు. తనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ కావడంతో కుంగిపోయాడు. చివరకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై జిల్లా కప్పలూరు వద్ద రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్‌‌ అని తేలింది.