నా అనుమతి లేకుండా నన్నెందుకు కన్నారు? ఈ విషయం ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా అడిగారా? అలా అడిగితే మన అమ్మా నాన్న పళ్లు రాలగొడతారు కదూ ? కానీ, ముంబకి చెందిన ఓ యువకుడు తన తల్లిదండ్రులను ఇవే ప్రశ్నలు వేస్తున్నాడు. తన అనుమతి లేకుండా, తన ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా అలా ఎలా కనేస్తారంటూ ఏకంగా కోర్టులో కేసు వేశాడు. రఫెల్ శ్యామ్యూల్ అనే 27 ఏళ్ల యువకుడు యాంటీ-నటలిజం పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. అసలు భారత సమాజానికి పిల్లలు అవసరం లేదని, వారిని అనవసరంగా భూమి మీదకు తీసుకొచ్చి కష్టాల్లోకి నెడుతున్నారనేది ఇతని భావన.
అంతే కాదు తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఆనందం, సరదా కోసం కంటున్నారని అంటున్నాడు. బొమ్మను చూసి ఆనందించినట్లే పిల్లలను కని వారితో ఆడుకుంటున్నారంటూ తమ స్వార్థం కోసమే తల్లిదండ్రులు పిల్లలను కంటున్నారని ఆరోపిస్తున్నాడు. తమ ఆస్తులు, వంశాన్ని కాపాడుకునేందుకు మాత్రమే పిల్లలను బలవంతంగా ఈ భూమి మీదకు తీసుకొస్తున్నారని, సమాజంలో అసలు పిల్లలే కనకూడదని, అలా కంటే భూమికి భారమే తప్పా మరే ప్రయోజనం లేదంటున్నాడు. అనవసరంగా పిల్లలను కని, వారిని చదువులు, కెరీర్, పెళ్లి అంటూ వారిని కష్టాల్లోకి నెట్టవద్దని చెబుతున్నాడు.
ఈ విషయంలో తన తల్లిదండ్రులు కూడా దోషులేనంటూ కోర్టుకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి శ్యామ్యూల్ ను తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ, అతడు మాత్రం వారు తనని అనవసరంగా కన్నారంటూ తెగ ఫీలైపోతున్నాడు. నా తల్లిదండ్రులు నాకు మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేను గొప్ప పొజీషన్లో ఉన్నాను. కానీ, వారు నన్ను కని బలవంతంగా కష్టాల్లోకి నెట్టారు. బానిసలుగా మార్చేశారు. పిల్లలను అనుమతి లేకుండా కనడమే కాకుండా వారిని కష్టాల్లోకి నెట్టే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? ఇకనైనా అంతా కళ్లు తెరవండి. భార్య, భర్తలు పిల్లలు లేని చైల్డ్‌ఫ్రీ జీవితాన్ని గడపండి అంటూ నిహిల్ ఆనంద్ పేరిట యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో సందేశాలు ఇస్తున్నాడు.