మరో వివాదంలో చింతమనేని !

One More Controversy Over Chintamaneni

నిత్యం ఏదో ఒక వివాదంతో తరుచూ వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వీరంగం సృష్టించారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని హాజరై ఆయనే స్వయంగా పింఛన్లు అందజేశారు. కాగా అందరిలాగానే పింఛను తీసుకోవడానికి గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వృద్ధుడు అక్కడికి వచ్చాడు.

అయితే అతని కుమారులు వైసీపీకి చెందిన వారు కావడంతో చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు. నీ కొడుకులు వైసీపీలో తిరుగుతుంటే పింఛన్‌ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని ఇంకాస్త రెచ్చిపోయారు. రాధాకృష్ణ ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మైక్ పడేసి వెళ్లిపోయాడు. అయితే, పోలీసలు మాత్రం రాధాకృష్ణను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రాధాకృష్ణను విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు పోలిస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చింతమేనని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.