పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలో ఒక వివాహిత మృతి చెందిన ఘటన కలకలంరేపుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. భర్త చంపాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె మృతదేహాన్ని బావిలో ఎవరు పూడ్చి పెట్టారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. భీమడోలు మండలం పొలసానిపల్లికి చెందిన నాగమణి, శ్రీను దంపతులు. ఈ నెల 19 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో భర్త పోలీసులకు ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈలోపు శ్రీను మీద అనుమానం పడ్డ పోలీసులు నిఘా పెంచారు. అలాగే స్థానికులు కూడా శ్రీను వ్యవహార శైలి తేడాగా ఉండటాన్ని గమనించారట. అంతేకాదు భార్య శవాన్ని ఇంట్లో నీళ్ల స్టోరేజీ కోసం ఏర్పాటు చేసిన బావిలో పూడ్చి.. పైన కాంక్రీట్‌తో కప్పేసినట్లు మద్యం మత్తులో స్థానికులతో చెప్పాడట. దీంతో పోలీసులు బావిలో తవ్వడంతో నాగమణి మృతదేహం కనిపించింది. గ్రామస్థుల సహకారంతో మృతదేహన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్ కోసం పంపించారు. ఇదిలా ఉంటే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుంటే కాదు అత్తింటివారే తమ కూతుర్ని చంపారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ మహిళ ఆత్మహత్య చేసుకుంటే ఆమె మృతదేహాన్ని బావిలో ఎవరు పూడ్చారన్నది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్త శ్రీనును ప్రశ్నిస్తున్నారు.