అన్నం పెట్టలేదని కన్నతల్లినే కొట్టి చంపిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల మేరకు బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని లంబాడి బస్తీ నందినగర్ కు చెందిన నేనావత్ సక్కుబాయి అలియాస్ సక్రు(55) ఇళ్లల్లో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు నేనావత్ గోపి తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రతిరోజూ పీకలదాకా మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వచ్చి తల్లితో పాటు చెల్లి రాణిని వేధించేవాడు. ఈనెల17న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను తల్లి సక్కుబాయిని నిద్రలేపి అన్నం పెట్టాలని కోరాడు.
తనకు ఒంట్లో బాగా లేదని, నువ్వే పెట్టుకు తినాలని చెప్పింది. తల్లి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పక్కనే ఉన్న చెల్లెలు రాణిని అన్నం పెట్టాల్సిందిగా కోపడటంతో ఆమె అన్నం వడ్డించింది. నిద్ర పోతున్న సమయంలో మళ్ళీ మళ్ళీ పిలుస్తూ అన్నం వడ్డించాల్సిందిగా వేధించడంతో ఆమె ఒకసారి కసురుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన గోపి అక్కడే ఉన్న బ్యాట్‌తో చెల్లెలి తలపై బలంగా మోదాడు. ఆమె అరుపులకు బయటకు వచ్చిన తల్లి సక్కుబాయి అడ్డుకునే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమెపై కోపంతో ఉన్న గోపి అదే బ్యాట్‌తో బలంగా తల్లి తలపై బాదాడు. తీవ్రం గా గాయపడిన సక్కుబాయిని స్థానికులు నిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూనే గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. రాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా అదే రాత్రి తల్లిపై దాడి చేస్తున్న సమయంలో అక్కడ దాడి దృశ్యాలు చుసిన అతని భార్య జ్యోతి అక్కడి నుంచి పరారైంది. నిందితుడిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.