మీరు విన్నది నిజమే…డిస్కౌంట్ ఇవ్వలేదనే కాల్చేశాడు. అలా అని ఇది ఎక్కడో అమెరికా లోనో, యూకే లోనో జరిగింది అనుకునేరు. సాక్షాత్తూ మన దేశంలోని పవిత్రమైన స్థలమైన వారణాసి లోనే జరిగింది.
విషయంలోకి వస్తే, ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో గల కంటోన్మెంట్ రోడ్డులో ఉన్న జేహెచ్‌వీ మాల్ నిన్న బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి బట్టలు కొనుక్కోడానికి వెళ్ళాడు. కొన్ని దుస్తులు సెలెక్ట్ చేసుకున్నాక, బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్లి, అక్కడ ఉన్న సునీల్ మరియు గోపి అనే స్టోర్ కీపర్లతో డిస్కౌంట్ విషయమై వాగ్వాదానికి దిగాడు. ఇంతలో ఏమైందో ఏమో, తన దగ్గరున్న తుపాకీ ని తీసి, సునీల్ మరియు గోపి లను కాల్చిపడేశాడు. ఈ ఘటనలో సునీల్ మరియు గోపి లు మృతి చెందగా, గోలు మరియు విశాల్ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గోలు మరియు విశాల్ లను మాల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా వారి ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
విషయం అందుకున్న పోలీసులు హుటాహుటిన మాల్ కి వచ్చి, సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఖాళీ చేయించి, తమ ఆధీనంలోకి తీసుకొని, సీసీ టీవీ ఫ్యూటేజ్ ల ద్వారా నిందుతుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా, ఇటువంటి ఘటనలు మనం ఎక్కడో ప్రాశ్చత్య దేశాల్లో జరిగినట్లు వింటుంటాం కానీ, మన దేశంలో ఇటువంటి దారుణం జరగడం ప్రజలలో ఆందోళన కలిగించే విషయమే. అయినా, తుపాకీ తో నిందితుడు అంత పెద్ద మాల్ లోకి ప్రవేశిస్తుంటే, కాపలా సిబ్బంది ఏమి చేస్తున్నారో ఏమో.