వామ్మో… ఏకంగా కిడ్నీ కొట్టేశారు !

Man stolen Kidney without taking any permission from him in Madurai

కిడ్నీ కొట్టేశారు… అదేంటి  అదేమన్నా ఫోనా లేక పర్స్ ఆ కొట్టేయడానికి అది కిడ్నీ… ఒక మనిషి కిడ్నీ కొట్టేయడం అంత ఈజీనా అని షాకవ్వకండి. నిజంగానే ఓ కుర్రాడి కిడ్నీని బంధువులే కొట్టేశారు. రక్తదానం పేరుతో ఆస్పత్రికి పిలిచి కిడ్నీ తీసుకున్నారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. బాధితుడి తల్లి చెబుతున్న వివరాల మేరకు… మధురై జిల్లా ఒత్తకడైకి చెందిన షకీలా భాను తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. భర్త మరణంతో కూలి పనులు చేసుకుంటూ ఆమె కుటుంబ భారాన్ని మోస్తోంది. టెన్త్‌లో చదువు ఆపేసిన ఆమె పెద్ద కొడుకు ఫక్రుద్ధీన్ (18) ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. 2017 ఆగష్టులో షకీలా భాను బంధువులమంటూ మదురై సమీపం కొట్టాంపట్టికి చెందిన సమీప బంధువు రాజా మహమ్మద్‌ మరికొందరిని వెంట పెట్టుకుని ఆమె ఇంటికి వచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయామని… సాయం చేస్తామని నమ్మబలికారు. వారికి ప్రతి నెలా సరుకులు కూడా అందజేస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే రాజా మహమ్మద్‌ అక్టోబరులో ఇంటికి వచ్చాడు. తన బంధువులు ఒకరు ఆస్పత్రిలో ఉన్నారని వాళ్లకు రక్తదానం చేసేందుకు ఫక్రుద్ధీన్‌ను పంపించాలని కోరారు. కుటుంబాన్ని ఆదుకున్నారనే అభిమానంతో ఆమె కొడుకును పంపేందుకు ఒప్పుకుంది. షకీలాతో పాటూ కొడుకును మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడికి పరీక్షలు నిర్వహించి… బ్లడ్‌లో ఇన్‌ఫెక్షన్ ఉందని… ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. దీంతో షకీలా తనకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేదని… ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తానంది. ఆ బంధువులే ఏం ఫర్వాలేదు… ట్రీట్మెంట్ తాము చేయిస్తామని నమ్మించారు.  చికిత్స చేయాల్సి ఉందని నమ్మబలికి ఒక కాగితంపై సంతకం తీసుకెళ్లాడు. కొడుకు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో ఆమె ఒప్పుకుంది. తర్వాత ఫక్రుద్దీన్‌కు ఆపరేషన్ కూడా చేశారు. ఫక్రుద్దీన్‌ను నెలరోజులపాటు ఆస్పత్రిలోనే ఉండి ఇంటికి వచ్చిన మహ్మద్‌ ఫక్రుద్ధీన్‌ నడవలేక నీరసించి పోయాడు, ఏ పని చేయలేకపోతున్నాడు.

అనుమాంతో తల్లి అతడ్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి అతడి కిడ్నీని తొలగించారని చెప్పడంతో ఆమె షాకయ్యిది. వెంటనే బంధువుల దగ్గరకు వెళ్లి నిలదీసింది. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని ఆర్థికంగా సాయం చేస్తామని బంధువులు చెప్పారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేకపోవడంతో షకీలా వారి ప్రతిపాదనకు ఒప్పుకుంది. ఈ మధ్య షకీలా బంధువుల్ని కలిసేందుకు వెళ్లింది. ఆ సమయంలో వాళ్లు బెదిరింపులకు దిగారట. డబ్బు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం చెప్పి బంధువులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొదటి నుంచి ఓ పథకం ప్రకారం డ్రామా ఆడిన షకీలా బంధువులు యువకుడి కిడ్నీని తెలియకుండానే కొట్టేశారు. తర్వాత డబ్బు పేరుతో బాధితుల నోళ్ల మూయించారు.