మంచు ఫ్యామిలీ నుండి హీరోలుగా విష్ణు మరియు మనోజ్‌లు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. మంచు విష్ణు కాస్త పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్‌లు దక్కించుకున్నాడు. కాని మంచు మనోజ్ మాత్రం ఇప్పటి వరకు కమర్షియల్‌గా ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా కూడా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తుంది. మోహన్‌బాబు చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థను ప్రారంభించాడు. ఆ బ్యానర్‌పై పలు పెద్ద చిత్రాలను నిర్మించారు. ఆ బ్యానర్ ఉండగానే మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అంటూ ఒక బ్యానర్‌ను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మంచు లక్ష్మి మంచు ఎంటర్టైన్మెంట్స్ అంటూ ఒక బ్యానర్‌ను ప్రారంభించడం జరిగింది.
మంచు ఎంటర్టైన్మెంట్స్లో మొదట ‘గుండెల్లో గోదారి’ చిత్రాన్ని మంచు లక్ష్మి నిర్మించింది. ఆ చిత్రం పాజిటివ్ టాక్‌ను దక్కించుకుని కలెక్షన్స్ విషయంలో నెగటివ్ అయ్యింది. ఆ చిత్రం మిగిల్చిన నష్టాల్లోంచి తాను ఇంకా బయటకు రాలేక పోతున్నాను అంటూ మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ‘వైఫ్ ఆఫ్ రామ్’ చిత్రం నిర్మాణంలో కూడా మంచు లక్ష్మి భాగస్వామిగా ఉంది. తాజాగా ఈ చిత్రం కూడా ఫలితం తారు మారు అయిన నేపథ్యంలో మంచు లక్ష్మి మరింతగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా ఈ విషయమై ఆమె మాట్లాడుతూ తాను నిర్మించిన సినిమాల వల్ల లాస్ వస్తే అన్ని అప్పులు తీర్చుకుంటూ నేను వస్తున్నాను. కాని నాకు రావాల్సిన డబ్బును మాత్రం ఒక నిర్మాత ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.