Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంచు ఫ్యామిలీకి గత కొంత కాలంగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుగా ఉంది. మోహన్‌బాబు ‘గాయత్రి’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది, మంచు మనోజ్ పలు చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంచు విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం విడుదలకే నోచుకోవడం లేదు. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ కారణంగా ఈ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావించారు. సంక్రాంతి సీజన్‌లోనే ఈ చిత్రం రావాల్సి ఉన్నా కూడా పెద్ద సినిమాలు విడుదల ఉన్నాయనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. అప్పటి నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది.
ఈ చిత్రాన్ని కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు కొనేందుకు ముందుకు రాలేదు. దాంతో నిర్మాత సొంతంగా విడుదల చేయాలని భావించాడు. కాని పలు చిత్రాలు జనవరి నుండి క్యూకట్టి వచ్చాయి. దాంతో పోటీ వద్దనే ఉద్దేశ్యంతో సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు థియేటర్ల బంద్ నడుస్తోంది. మార్చి చివర్లో ‘రంగస్థలం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే ‘మహానటి’, ‘నా పేరు సూర్య’, ‘భరత్ అను నేను’ ఇంకా పెద్ద చిత్రాలు అనేకం విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం మరింత ఆలస్యం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మే చివరి వరకు ఈ చిత్రం విడుదలకు సమయం లేదని, దాంతో జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారేమో చూడాలి. ఈ మద్యలో చేస్తే ఖచ్చితంగా సినిమాను చేతులారా చంపేసినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.