కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దీంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. అంతరాష్ట్రాల సరిహద్దులు కూడా సీజ్ అయ్యాయి. కానీ నిత్యావసరాల సరఫరాలో భాగంగా కొన్ని గూడ్స్ ను అనుమతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తెలంగాణ మార్గంలో ఓ ఘటన చోటుచేసుకుంది. బాటలో పోలీసులు లారీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. సరిహద్దుకు ఆ లారీ వచ్చీ రాగానే డ్రైవర్ ను తీసుకువెళ్ళి ఐసోలేషన్ కు తరలించారు. కారణం అతను కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఓ లారీ డ్రైవర్. మహారాష్ట్రలో మామిడిపండ్ల లోడ్ ను దిగుమతి చెయ్యడానికి వెళ్ళాడు. రాష్ట్రం కాని రాష్ట్రం కావడంతో అక్కడి అధికారులు అందరికీ పరీక్షలు చేశారు. సదరు డ్రైవర్ కూడా శాంపిల్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను ఏపీకి బయలుదేరాడు.
అయితే అక్కడ టెస్ట్ చేసిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. తీరా చూస్తే అక్కడ లారీ లేదు. వెంటనే సరిహద్దులను అలెర్ట్ చేశారు ముంబై అధికారులు. ఈ విషయం ఇంటలిజెన్స్ వరకు వెళ్లింది. వాళ్ళు కూడా రంగంలోకి దిగి నిర్మల్ చెక్ పోస్టు వద్ద కాపు కాసి పట్టుకున్నారు. లారీ వచ్చిన వెంటనే డ్రైవర్ ను బయటకు తీసుకు వచ్చి ఐసోలేషన్ కు తరలించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ ను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది.