Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదేళ్ల సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్…ఏనాడూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల జోలికి వెళ్లలేదు. ఆ మాటకోస్తే ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అన్నవారెవరూ లేరు. కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీపైనా ఆయన ఎప్పుడూ రాజకీమ విమర్శలు చేసి ఎరగరు. ప్రధాని హోదాలో ఆయన చాలా హుందాగా నడుచుకునేవారు. రాజకీయాలతో తనకు సంబంధం లేనట్టు ఉండేవారు. తనపై వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ విమర్శలు ఏమన్నా వచ్చినా ఆయన ఎప్పుడూ స్పందించేవారు కాదు. మౌనమునిలా ఉండేవారు. అలాంటి మన్మోహన్ సింగ్ కు ప్రధానీ మోడీ కోపం తెప్పించారు. పాకిస్థాన్ తో అంటకాగుతున్నారనే అర్ధం వచ్చేలా మోడీ… తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయ లబ్దికోసం మోడీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ ఆరోపణలు తనను చాలా బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన విందులో గుజరాత్ ఎన్నికలపై చర్చించలేదని, కేవలం ఇండో పాక్ సంబంధాల గురించి మాత్రమే చర్చకు వచ్చిందని స్పష్టంచేశారు. మోడీ ఈ విషయంపై క్షమాపణ చెప్పి ప్రధానమంత్రి కార్యాలయ హుందాతనాన్ని కాపాడాలని కోరారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ…కాంగ్రెస్ ను. పాకిస్థాన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ కు పాక్ సాయం చేస్తోందని మోడీ ఆరోపించారు. మణిశంకర్ అయ్యర్ ఇంట్లో ఇందుకోసం ఓ భేటీ జరిగిందని, పాక్ మాజీ అధికారులు, నేతలతో పాటు..భారత మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారని, ఇది అనేక సందేహాలను కలిగిస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. ఈ భేటీ జరిగిన తర్వాత రోజే మణిశంకర్ తనను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారని మోడీ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.