Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాన మంత్రి నరేంద్రమోడీని చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా ? ఆయనకీ త్వరలోనే ప్రాణగండం ఉందా ? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ప్రధాని మోడీని చంపే ప్రయత్నాల్లో మావోయిస్టులు ఉన్నారంటూ పుణె పోలీసులు ఓ కుట్రను బయటపెట్టారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న ఐదుగుర్ని తాము బుధవారం అదుపులోకి తీసుకోగా, వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లేఖను సీజ్ చేశామని పుణె పోలీసులు స్థానికంగా సెషన్స్ కోర్టుకు నివేదించారు. దీని ఆధారంగా ప్రధాని మోదీని రాజీవ్ గాంధీ హత్య తరహాలో అంతమొందించే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల్లో ఒకరయిన రోనాజాకబ్ నివాసం నుంచి లేఖను స్వాధీనం చేసుకున్నట్టు ప్రాసిక్యూటర్ ఉజ్వల్ పవార్ కోర్టుకు తెలిపారు. అందులో ఎం-4 రైఫిల్, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేసేందుకు రూ.8 కోట్లు అవసరమని పేర్కొనడంతో పాటు, మరో రాజీవ్ గాంధీ తరహా ఘటన గురించి ప్రస్తావన ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకుండా మరో రాజీవ్ గాంధీ ఘటన తరహాలో ఆలోచిస్తున్నట్టు నివేదించారు. అయితే, ప్రాసిక్యూషన్ వాదనలను, ప్రవేశపెట్టిన పత్రాలను అవాస్తవాలుగా నిందితుల తరఫున డిఫెన్స్ న్యాయవాది వాదించారు.
మరోపక్క పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా కూడా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హతమార్చి, భారత్‌ను విచ్ఛిన్నం చేస్తామని ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో జిహాదీ యుద్ధాన్ని ప్రకటించాలని ఆ సంస్థ సభ్యుడు మౌలానా బాషిర్ అహ్మద్ ఖాకి పిలుపునిచ్చాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావాల్కోట్ పట్టణంలో పవిత్ర రంజాన్ 2018 మాసంలో శుక్రవారం మత ప్రార్థనలకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. జిహాద్‌కు రంజాన్ మంచి సమయం అని, జీహాదీలో ప్రాణాలు కోల్పోతే స్వర్గానికి వెళ్తారని ముస్లిం యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.