Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశం కోసం అసువులు బాసి అమరవీరుడయిన ఓ జవాన్ కుటుంబానికి సాక్షాత్తూ సీఎం సభలోనే ఘోర అవమానం ఎదురయింది. ప్రభుత్వం తనకు ఇచ్చి మర్చిపోయిన హామీలను ఒక్కసారి ముఖ్యమంత్రికి గుర్తుచేయాలనుకోవడమే ఆ అమరవీరుని కుమార్తె చేసిన నేరం. ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రిని కలవాలనుకున్నందుకు ఆ యువతిని ఈడ్చివేశారు. ఈ దారుణ ఘటన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కెవడియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సభకు అమరవీరుడైన బీఎస్ ఎఫ్ జవాను కుమార్తె రూపాల్ తడ్వి హాజరయింది. అందరితో పాటు సభలో కూర్చున్న రూపాల్… సభ మధ్యలో ఆకస్మికంగా లేచి నిలబడి సీఎం ను కలవాలి అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ వేదిక దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రూపాల్ ను గమనించిన మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పోలీసులను కోరుతున్నప్పటికీ వాళ్లు విన్పించుకోకుండా నిర్దాక్షిణ్యంగా కాళ్లు చేతులు పట్టుకుని బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రూపాల్ తండ్రి అశోక్ తడ్వి బీఎస్ ఎఫ్ జవాన్ గా పనిచేస్తూ విధినిర్వహణలో అమరుడయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం జవాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది. ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని కేటాయిస్తామని హామీఇచ్చింది. ఇది జరిగి 15 ఏళ్లు గడిచింది. అయినా రూపాల్ కుటుంబానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇతర ఏ విధమైన సాయమూ అందించలేదు. దీంతో రూపాల్ కొన్నేళ్లుగా తమ కుటుంబానికిచ్చిన హామీల కోసం ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం కెవడియాకు వచ్చిన సీఎంను కలిసేందుకు ప్రయత్నించింది. కానీ సభలో ఆమెకు ఘోర పరాభవం జరిగింది.
మాజీ సైనికుడి కూతురు అన్న గౌరవం కూడా లేకుండా, ఆమె కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు ఆమెతో దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమరవీరుడి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవమిదేనా… అని ప్రశ్నించారు. సీఎం తీరును తప్పుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి రూపానీ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. రూపాల్ తో దురుసుగా ప్రవర్తించిన పోలీస్ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఆమె కుటుంబానికి 4 ఎకరాల స్థలం, నెలకు రూ. 10వేల పెన్షన్, బీజేపీ తరపున రూ. 36వేల పెన్షన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. సైనికుడు మరణించినప్పుడు ఇచ్చిన హామీనే నెరవేర్చని ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రూపాల్ కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.