Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గల్ఫ్ దేశాల్లో పెద్ద ఎత్తున షాపింగ్ కొనసాగుతోంది. దీంతో రంజాన్ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారీ స్థాయిలో డిస్కౌంట్లను ప్రకటించారు. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అన్ని రకాల వస్తువులను అందజేయడానికి దుకాణదారులు 90 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల వస్తువులపైనా ఈ డిస్కౌంట్ ఉంటుంది. ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు షార్జాలోని ఎక్స్‌పో సెంటర్‌లో ఏ వస్తువు కొన్నా, దానిపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తారు.
ఏ వస్తువు కొన్నా 90 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా అన్ని షాపింగ్‌మాల్స్, షోరూమ్‌ల యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎమిరేట్స్ ఎకానమీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొన్ని రకాల ఆహార పదార్థాలపైనా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 90 శాతం డిస్కౌంట్ అంటే మాటలు కాదు. కానీ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసుకోవాలని, తమకు అవసరమైన, ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిస్కౌంట్ అమలయ్యేలా ఆదేశాలు జారీ చేసినట్లు వినియోగదారుల పరిరక్షణ విభాగం డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నువాయిమీ తెలిపారు. తెల్లవారు జాము వరకూ అమ్మకాలు కొనసాగుతాయని అన్నారు. అప్పెరల్స్, ఫుట్‌వేర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెట్స్‌లకు భారీ డిమాండ్ ఉంటుందని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని అన్నారు.