తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు రెబల్స్ గా మారి నామినేషన్ వేశారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్రావు కూడా మినహాయింపు కాదు ఆయన షాద్ నగర్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డికి కేటాయించింది. దీంతో అసహనానికి గురైన శంకర్రావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసి రెబల్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన నామినేషన్ వేసారు. శంకర్రావు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2009లో షాద్‌నగర్ స్థానం జనరల్ కేటగిరికి మారడంతో ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేశారు. కానీ 2014 లో శంకర్రావుకు అధిష్టానం టికెట్ నిరాకరించడంతో పోటీకి దూరంగా ఉన్నారు.
అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ,రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ లో పోటీ చేస్తానంటూ ఆయన ముందుకొచ్చారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి షాద్‌నగర్ ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి కృష్ణకు నామినేషన్ సమర్పించారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆయన సతీమణి విశ్వశాంతి చేత కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వెంటనే సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేయాలని ఫోన్ రావడం.. కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన షాద్‌నగర్‌కు తన కూతురుతో కలిసి వచ్చి సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే షాద్‌నగర్ అసెంబ్లీ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ తరఫున వేసిన నామినేషన్‌ను, తన సతీమణి విశ్వశాంతి స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. కాంగ్రెస్, మహాకూటమి తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల గెలుపుకు తాను కృషి చేస్తానని శంకర్రావు స్పష్టం చేశారు .ఈ పరిణామంతో ఆయనకు టికెట్ కేటాయించిన సమాజ్‌వాది పార్టీ షాకయింది. ఎవ్రీ థింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనట్టు రాజకీయం కూడా అంతేనెమో ?